The Paradise

The Paradise: నాని ట్వీట్‌కు సీఎం రేవంత్, డీజీపీ రిప్లై.. నిమజ్జనం వేళ తీవ్ర ఉత్కంఠ!

The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. దీనికి ఒక రోజు ముందుగానే, సెప్టెంబర్ 23 బుధవారం రాత్రి భారీ ఎత్తున ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. అయితే, ఈ ప్రీమియర్ షోను హైదరాబాద్‌లోని సినిమా హబ్‌గా పేరొందిన ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి చూడాలని ఉందంటూ నాని  సోషల్ మీడియా వేదికగా చేసిన విజ్ఞప్తి సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య చూడటమే అసలైన అనుభూతి.. నాని విజ్ఞప్తి

తాను చిన్నప్పటి నుంచి సినిమాలను చూసి పెరిగిన సాధారణ అభిమానినని, ఎవరి కోసమైతే ఈ సినిమాని రూపొందించామో ఆ ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో విజిల్స్ వేస్తూ సినిమా చూడటమే తనకు అసలైన సంతృప్తినిస్తుందని నాని తన పోస్టులో పేర్కొన్నారు.
సెప్టెంబర్ 23 రాత్రి ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో సినిమా చూసేందుకు అనుమతించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పోలీసు అధికారులను అభ్యర్థించారు. ప్రభుత్వం విధించే అన్ని భద్రతా నియమాలు, ప్రోటోకాల్స్‌ను తప్పక పాటిస్తామని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందన – డీజీపీ సూచన
నాని పోస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. భద్రతా నిబంధనలను గౌరవిస్తున్నందుకు, తెలంగాణ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన సినిమాపై చూపిస్తున్న అంకితభావానికి నానిని అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ, విషయాన్ని పరిశీలించాల్సిందిగా డీజీపీ సి.వి. ఆనంద్‌కు ట్యాగ్ చేశారు.
సీఎం ట్వీట్‌పై స్పందించిన డీజీపీ సి.వి. ఆనంద్.. ప్రస్తుతం వినాయక నిమజ్జనాలు చివరి దశకు చేరాయని, హుస్సేన్‌సాగర్‌కు వెళ్లే వాహనాలు, జనసందోహంతో సమీపంలోని ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్ ప్రాంతం కిక్కిరిసిపోయి ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో అదనపు బలగాలను మోహరించి భద్రత కల్పించడం సాధ్యమవుతుందా అనే కోణంలో హైదరాబాద్ నగర పోలీసులతో చర్చిస్తామని, రెండేళ్ల క్రితం జరిగిన తొక్కిసలాట చేదు అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని వివరించారు.
గతం తాలూకు చేదు జ్ఞాపకాలు – ఉత్కంఠలో ఫ్యాన్స్..
గతంలో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద భారీగా తరలివచ్చిన జనసందోహం వల్ల తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం, బాలుడు గాయపడటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అప్పటి నుంచి ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో స్టార్ హీరోల ప్రీమియర్ షోలు, థియేటర్ విజిట్‌లపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.

అయినప్పటికీ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన బందోబస్తు ఏర్పాట్లతో నాని అభిమానుల మధ్య ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని వీక్షించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుండటంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *