PM Modi

Ayushman Bharat: 60 కోట్ల మందికి ఏటా రూ.5 లక్షల ఉచిత వైద్య భరోసా..!

PM Modi: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం ‘ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY)’ విజయవంతంగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. 2018 సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా నిరుపేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా చేరువ చేయడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. ఈ చారిత్రక మైలురాయి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పథకం సాధించిన అద్భుత విజయాలను పంచుకున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ స్కీమ్.. ప్రధాని మోదీ

రూ.5 లక్షల ఉచిత వార్షిక కవరేజీ
ఎనిమిదేళ్ల క్రితం ప్రతి భారతీయుడికి అత్యుత్తమమైన, అందుబాటు ధరలో నాణ్యమైన వైద్యం అందాలన్న సంకల్పంతో ఆయుష్మాన్ భారత్ మొదలైంది. ప్రస్తుతం దేశంలో 60 కోట్లకు పైగా పౌరులకు ఏటా కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య కవరేజీ అందుతోంది అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.

 

రూ.2 లక్షల కోట్లకు పైగా ఆదా
తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రి పాలయ్యే పేద కుటుంబాలకు ఈ ఉచిత చికిత్సల వల్ల ఏకంగా రూ. 2 లక్షల కోట్లకు పైగా జేబు ఖర్చులు ఆదా అయ్యాయి.

 

ఆరోగ్య మందిరాల ద్వారా ఇంటి ముంగిటకే సేవలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా పనిచేస్తున్న ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’లకు ఇప్పటివరకు 500 కోట్లకు పైగా విజిట్స్ నమోదయ్యాయని, ఇవి గ్రామీణ స్థాయిలో హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేశాయని ప్రధాని వివరించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ, MyGovIndia విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం..
కార్డులు & హాస్పిటల్ అడ్మిషన్లు
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 48.54 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. ఆగస్టు 2026 నాటికి 38,000 కంటే ఎక్కువ నమోదిత (ఎంపానెల్డ్) ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా 13.25 కోట్ల ఆసుపత్రి అడ్మిషన్లకు ప్రభుత్వం నిధులు సమకూర్చింది.
1,961 రకాల వైద్య విధానాలు
27 కీలక స్పెషాలిటీల పరిధిలోని 1,961 శస్త్రచికిత్సలు, వైద్య ప్రక్రియలు ఈ పథకంలో ఉచితంగా లభిస్తున్నాయి.
మహిళలు & వృద్ధులకు పెద్దపీట
మొత్తం లబ్ధిదారుల కార్డుల్లో దాదాపు 50 శాతం మహిళల పేరు మీదే ఉన్నాయి. ఇటీవల 70 ఏళ్లు పైబడిన సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు (వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా) ‘ఆయుష్మాన్ వయ వందన’ కార్డుల ద్వారా పథకాన్ని విస్తరించగా, ఇప్పటికే 1.36 కోట్ల మంది వృద్ధులకు ఈ కార్డులు అందాయి.
ఆశా, అంగన్‌వాడీలకు రక్షణ
క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న 44.81 లక్షల మందికి పైగా ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను కూడా ఈ పథకం కవరేజీ పరిధిలోకి తీసుకువచ్చారు.
పోర్టబిలిటీ సదుపాయం
లబ్ధిదారులు సొంత రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లోనూ నగదు రహిత చికిత్సలు పొందే ‘నేషనల్ పోర్టబిలిటీ’ ద్వారా ఇప్పటివరకు 30 లక్షలకు పైగా క్లెయిమ్స్ (విలువ రూ. 8,800 కోట్లు) పరిష్కారమయ్యాయి.
1.86 లక్షల ఆరోగ్య మందిరాల్లో స్క్రీనింగ్‌లు

ప్రాథమిక స్థాయిలోనే రోగాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 1.86 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సేవలందిస్తున్నాయి. వీటి ద్వారా అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) వ్యాధుల కోసం 42 కోట్లకు పైగా స్క్రీనింగ్‌లు నిర్వహించారు. అలాగే నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించేందుకు కోట్ల సంఖ్యలో పరీక్షలు చేపట్టారు. డిజిటల్ మిషన్ (ABDM), హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌లతో అనుసంధానమై సామాన్యుడి ప్రాణాలకు భరోసాగా ఆయుష్మాన్ భారత్ నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *