Terrorists: ఆపరేషన్ సిందూర్ దెబ్బతో గట్టి దెబ్బతిన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ (Jaish-e-Mohammed) తిరిగి తన కార్యకలాపాలను విస్తరించుకునే ప్రయత్నంలో పడింది. ఈసారి కొత్తగా మహిళలతో కూడిన ఉగ్రదళం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, జైషే మహ్మద్ తొలిసారిగా “జైషే మహిళా బ్రిగేడ్” (female terrorist brigade) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతోంది.
ఇందులో భాగంగా ఆ సంస్థ ఆన్‌లైన్ శిక్షణా కోర్సులను ప్రారంభిస్తోంది. ‘తౌఫల్ అల్ ముమినాత్’ అనే పేరుతో నవంబర్ 8 నుంచి ఈ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ 40 నిమిషాలపాటు మతపరమైన సిద్ధాంతాలు, జిహాద్ సిద్ధాంతం, ఉగ్రవాద శిక్షణకు సంబంధించిన పాఠాలు బోధించనున్నారు. ఈ కోర్సులో పాల్గొనాలనుకునే మహిళలు రూ.500 పాకిస్తానీ రూపాయలు విరాళంగా చెల్లించాలని ఆ సంస్థ సూచించింది.
నిఘా వర్గాల ప్రకారం, జైషే మహ్మద్ తీవ్రవాదుల భార్యలు, పేద మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల మహిళలను రిక్రూట్ చేసుకోవడంపై దృష్టి సారిస్తోంది. ఈ మహిళా బ్రిగేడ్‌కు మసూద్ అజార్ చెల్లెళ్లు — సాదియా అజార్, సమైరా అజార్ నాయకత్వం వహిస్తున్నట్లు గుర్తించారు.
గతంలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం బహవల్‌పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కేంద్రంపై బాంబులు వేయగా, మసూద్ అజార్ కుటుంబానికి చెందిన పది మంది మృతి చెందారు. వారిలో మసూద్ బావ మరియు సాదియా భర్త యూసఫ్ అజార్, అలాగే సమైరా భర్త, పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి ఉమర్ ఫరూక్ కూడా ఉన్నారు.
వారిద్దరి మరణాల తర్వాత, సాదియా మరియు సమైరా ఇప్పుడు మహిళలను ఉగ్రవాద మార్గంలో నడిపించేందుకు ఈ ఆన్‌లైన్ జిహాద్ కోర్సులను ప్రారంభించినట్లు నిఘా సంస్థలు వెల్లడించాయి.
ఇక ఈ కొత్త మహిళా బ్రిగేడ్ భారతదేశంలో తన నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రయత్నాలు చేయవచ్చని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో భారత భద్రతా సంస్థలు సోషల్ మీడియా, ఆన్‌లైన్ నెట్‌వర్క్‌ల పట్ల మరింత అప్రమత్తంగా ఉన్నాయని సమాచారం.

