Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై ప్రస్తుతం అనేక సందిగ్ధతలు నెలకొన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఆయన భారతదేశానికి హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఇండియాకు రాలేదు. దీంతో కేసు విచారణలో మరింత ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు ఇప్పటికే ప్రభాకర్ రావుకు వన్ టైం ట్రావెలింగ్ వీసా తీసుకుని మూడు రోజుల్లో భారత్‌కు రావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆయన ఇప్పటివరకు ఆ వీసా తీసుకోలేదు. కేంద్రం ఇప్పటికే సంబంధిత అధికారులను వన్ టైం ఎంట్రీ ట్రావెలింగ్ వీసా మంజూరు చేయాలని ఆదేశించినప్పటికీ, ప్రయాణ పత్రాలు ఇంకా అతనికి అందలేదని తెలిసింది.
ఇది కూడా చదవండి: Cholesterol: ఈ పండుతో కొలెస్ట్రాల్ కంట్రోల్.. ఒక్కటైనా తినండి
Phone Tapping Case: ఇకపోతే, ప్రభాకర్ రావు విచారణ జరిగితేనే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే S.I.T. (Special Investigation Team) పలువురు నిందితుల స్టేట్మెంట్స్, డేటా, సాంకేతిక ఆధారాలను సేకరించినప్పటికీ, అసలు యథార్థం వెలుగు చూసేలా మాత్రం ప్రభాకర్ రావు విచారణ జరగాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండటం, మరోవైపు ప్రభాకర్ రావు భారత్‌కు ఇంకా రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రభాకర్ రావు విదేశాల్లోనే మిగిలిపోవాలన్న ఆలోచనలో ఉన్నారా? లేక వీసా ప్రక్రియలలోనే జాప్యం జరుగుతోందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, దర్యాప్తు పద్ధతులు, నిందితుల కదలికలు — అన్నీ కలిపి రాష్ట్ర రాజకీయాలను ప్రకంపనలు తీసుకొస్తున్నాయి. ప్రభాకర్ రావు ఇండియాకు ఎప్పుడు వస్తారు. ఆయన విచారణ ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలపై ఇప్పుడు అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

