National Games: ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో తెలుగు క్రీడాకారుల ప్రదర్శన అద్భుతంగా సాగుతోంది. పతకాల వేటలో మన క్రీడాకారులు మంచి జోరు చూపిస్తున్నారు. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చెలరేగి ఆడుతుండడంతో తెలుగు రాష్ట్రాల ఖాతాలో పతకాలు వరుసగా చేరుతున్నాయి. అయితే టోర్నమెంట్ ప్రారంభమై చాలా రోజుల వరకు స్వర్ణ పథకం లేని తెలంగాణ జట్టుకు ఇప్పుడు వరుసగా మూడు రోజుల్లో మూడు స్వర్ణ పథకాలు వచ్చి ఖాతాలో చేరాయి.
38వ నేషనల్ గేమ్స్ లో తెలంగాణ క్రీడాకారిణి నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకంతో తన సత్తా నిరూపించింది. మహిళల కళాత్మక జిమ్నాస్టిక్స్ విభాగంలో ఆమె స్వర్ణ పతకాన్ని సాధించింది. టేబుల్ వాల్ట్ పోటీలో నిష్కా 12.717 పాయింట్లతో మొదటి స్థానం సాధించింది. ఫైనల్లో ఎనిమిదిమందితో పోటీ పడి ఈ విజయాన్ని సాధించింది. తెలంగాణకు ఇది మూడవ స్వర్ణ పతకం.
తెలంగాణకు ఈ పతకం జిమ్నాస్టిక్స్ లో రావడం అనేది నిజంగా విశేషమే. సాధారణంగా దక్షిణ భారతదేశము నుండి జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు తక్కువ. ఉత్తర భారత దేశంలోనే ఎక్కువ మంది జిమ్నాస్టిక్స్ వైపు మొగ్గు చూపుతారు. పైగా మనదేశంలో జిమ్నాస్టిక్స్ కి ఉండే ప్రాచుర్యం కూడా అంతంత మాత్రమే. అంతర్జాతీయ వేదికపై జిమ్నాస్టిక్స్ అంటే వినిపించే పేరు చైనా. మరి భవిష్యత్తులో మన క్రీడాకారులు జిమ్నాస్టిక్స్ లో అంతర్జాతీయ వేదికపై సత్తారని ఇలాంటి ప్రదర్శన వల్ల ఆశించే అవకాశం ఉంటుంది.
ఇక అదే పోటీలో ప్రణతి నాయక్ (12.700 – ఒరిస్సా) రజత పతకం, ప్రతిష్ట సమంత (12.484 – పశ్చిమ బెంగాల్) కాంస్య పతకం గెలుచుకున్నారు. మరోవైపు రెజ్లింగ్‌లో తెలంగాణ క్రీడాకారుడు నిఖిల్ యాదవ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కర్ణాటక రెజ్లర్‌ను ఓడించి ఈ పతకాన్ని సాధించాడు.
బుధవారం పోటీలు ముగిసే సమయానికి తెలంగాణ 25వ స్థానంలో ఉండి, 3 స్వర్ణాలు, 3 రజతాలు, 10 కాంస్యాలతో మొత్తం 16 పతకాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలతో కలిపి 14 పతకాలు గెలుచుకొని 18వ స్థానంలో నిలిచింది.