Personal vehicles Tax: తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు ఇకపై అధిక జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్) చెల్లించాల్సి ఉంటుంది. ఖరీదైన ద్విచక్ర వాహనాలు, కార్లపై ఈ పన్ను భారం ఎక్కువగా పడనుంది. అలాగే, ఫ్యాన్సీ నంబర్ల కోసం చెల్లించే ఫీజులు కూడా భారీగా పెరిగాయి. ఈ మేరకు రవాణా శాఖ జీవోలను జారీ చేసింది.
ద్విచక్ర వాహనాలపై పెరిగిన పన్ను
కొత్త నిబంధనల ప్రకారం, ద్విచక్ర వాహనాల పన్ను శ్లాబులు రెండు నుంచి నాలుగుకు పెరిగాయి. వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. లక్ష లోపు ఉంటే పన్ను పెంపు ఉండదు.
ధర రూ. లక్ష దాటితే: 3% అదనపు పన్ను.
ధర రూ. 2 లక్షలు దాటితే: 6% అదనపు పన్ను.
ఉదాహరణకు, రూ. 1.10 లక్షల విలువైన బైక్‌కు గతంలో రూ. 13,200 లైఫ్ ట్యాక్స్ ఉండగా, ఇప్పుడు అది రూ. 16,500 అవుతుంది.
కార్లపై అదనపు భారం
కార్లకు లైఫ్ ట్యాక్స్ శ్లాబులు నాలుగు నుంచి ఐదుకు పెంచారు. రూ. 10 లక్షల లోపు కార్లకు పన్ను పెంపు లేదు.
ధర రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు: 18% పన్ను.
ధర రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు: 20% పన్ను.
ధర రూ. 50 లక్షలు దాటితే: 21% పన్ను.
కంపెనీల వాహనాలకు రూ. 50 లక్షలు దాటితే 25% పన్నుగా నిర్ణయించారు.
Also Read: Pakistan: పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కాల్పులు.. ముగ్గురి మృతి
ఫ్యాన్సీ నంబర్లకు భారీగా పెరిగిన ఫీజులు
వాహనదారులు ఎక్కువగా కోరుకునే ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు కూడా భారీగా పెరిగాయి. గతంలో ఐదు శ్లాబులు ఉండగా, ఇప్పుడు అవి ఏడుకు పెరిగాయి. ఉదాహరణకు, 9999 వంటి నంబర్‌కు కనీస ధర రూ. 50 వేల నుంచి రూ. 1.50 లక్షలకు పెరిగింది. కొత్త శ్లాబులు రూ. 1.50 లక్షల నుంచి మొదలవుతాయి.
ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ. 2,000 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు త్వరలో అమల్లోకి రానున్నాయి.

