Telangana Politics: రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశానికి తెరలేచింది. మునుపెన్నడూ లేనిరీతిలో ఈ పరిణామం దారితీసే అవకాశం ఉండటంతో దీనిపై మరింత ఉత్కంఠ నెలకొన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఓ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన వీరంతా కాంగ్రెస్ లో చేరారని ఆరోపిస్తూ, వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ సుప్రీంకోర్టులో వేసిన కేసు విచారణ కొనసాగుతుంది.
ఈ దశలో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉందని భావిస్తున్న ఈ తరుణంలో ఏకంగా వారు కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కడం ఆసక్తిగా మారింది. తాము పార్టీ మారలేదని, ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామని పేర్కొంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. దీంతో ఈ కేసు విచారణ మరో మలుపు తిరగనున్నది. అది ఎటు దారితీస్తుందో, ఏమవుతుందోనని ఉత్కంఠ నెలకొన్నది.
గతంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాము అనుకూల తీర్పు రాకపోవడంతో ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ పలుమార్లు జరిగింది. స్పీకర్, ఇతర శాసనసభ కార్యాలయ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలని ఆదేశిస్తూ, ఎంతకాలంలో చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ ఏకంగా నోటీసులే జారీ చేసింది. ఇక ఎలాగైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనర్హత వేటు పడుతుందని అందరూ భావిస్తున్న ఈ తరుణంలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న వైఖరిపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్నది.
Also Read: Bhim UPI: చిన్న వ్యాపారులకు వరం భీమ్ యూపీఐ.. చెల్లింపులపై ప్రోత్సాహకాలు
తాము సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామని, దానిని మీడియా వక్రీకరించి తాము పార్టీ మారినట్టు చూపించింది అని సుప్రీంకోర్టులో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఒక్కక్కరుగా అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసినట్టు సమాచారం.
పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగానే చేరారు. ఆ పార్టీ కార్యకలాపాల్లో బహిరంగంగానే పాల్గొంటూ వస్తున్నారు. అయితే తాను పార్టీ ఫిరాయించలేదని, తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, బీఆర్ఎస్ పార్టీతో తనకు మంచి అనుబంధం ఉన్నదని చెప్పుకొచ్చారు. శాసనసభకు మూడోసారి ఎన్నికయ్యాక వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశానని, పార్టీ మాత్రం మారలేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టు సమాచారం.
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే సైతం ఈ విధంగానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలుస్తున్నది. ఆ ముగ్గురుతోపాటు ఇతరులు కూడా వెళ్తారని సమాచారం. ఈ దశలో ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ అఫిడవిట్లపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి మరి. కేసు విచారణ అంతిమ దశకు వచ్చిన ఈ తరుణంలో సుప్రీంకోర్టు విచారణ ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ ఎలా ప్రతిస్పందిస్తుందో? త్వరలో తేలనున్నది.