Telangana: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అప్పులతో కాలం వెళ్లదీస్తున్నాయి. గత పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసి 10 నెలలు పూర్తి కావస్తున్నా ఎన్నికలు జరగనేలేదు. ఫలితంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నిధులూ విడుదల కావడం లేదు. దీంతో ప్రస్తుతం కనీస అవసరాలకూ పంచాయతీల ఖాతాల్లో నయాపైస లేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలుగా పంచాయతీల కార్యదర్శులు అప్పులుదెచ్చి పాలన సాగిస్తున్నారు. నెలలు గడుస్తున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో వారు కూడా చేతులెత్తేసే పరిస్థితి దాపురించింది.
Telangana: రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో ప్రధానంగా బ్లీచింగ్, వీధి దీపాలు, మోటర్ల మరమ్మతు, ట్రాక్టర్ల డీజిల్ తదితర ఖర్చులకు పంచాయతీ కార్యదర్శులే సొంతంగా భరించాల్సి వస్తున్నది. గతంలో పాలకవర్గాలు చేసిన పనులకూ బిల్లులు మంజూరుకాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఆందోళనబాట పట్టారు. ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో పంచాయతీల కార్యదర్శులు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు తడిసి మోపెడయ్యారు. దీంతో ప్రభుత్వానికి పెండింగ్ బిల్లుల భారం మరింతగా పెరిగింది.
Telangana: గతంలో సర్పంచులు ఉంటే ప్రతి పనికి వారే ఖర్చు చేసేవారు. ఆ తర్వాత వారు బిల్లులు పెట్టుకొని తీసుకునేవారు. నేడు సర్పంచులు లేకపోవడంతో కార్యదర్శులే సొంతంగా అప్పులు తెచ్చి మరీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని ఒక్కోజిల్లాలో ఈ 10 నెలల కాలంలోనే కార్యదర్శులు చేపట్టిన పనులకు సుమారు 20 నుంచి 25 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు ఉండే అవకాశం ఉన్నది. ఇలా మైనర్ పంచాయతీల్లో అయితే సుమారు రూ.ఒక లక్ష నుంచి రూ.3 లక్షల వరకు, మేజర్ పంచాయతీల్లో అయితే సుమారు రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం.
Telangana: తాము చేసిన ఖర్చులకు గాను బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ ప్రస్తుత పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు వినతిపత్రాలను సైతం ఇస్తూ తమ వేదనను వారి వద్ద వల్లె వేస్తున్నారు. ఇప్పటికే అప్పుల భారం పెరిగిందని, ఇక తాము భరించలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకుంటే, పల్లెల్లో పారిశుధ్యం, ఇతర అత్యవసర పనులకు ఆటంకం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది.