Telangana: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు వేగవంతంగా అడుగులు పడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలా? లేక విడిగా నిర్వహించాలా? అన్న అంశంపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా పరిషత్, పంచాయతీ ఎన్నికలను మాత్రం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు గ్రామాల్లో కూడా ఎన్నికల వేడి రగులుకున్నది. పరిషత్ ఎన్నికలు పార్టీల పరంగా జరుతుండగా, పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా జరుగుతాయి.
Telangana: స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఇన్నాళ్లూ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా బీసీ గణన లెక్క తేలడంతో రిజర్వేషన్ల లెక్కను కూడా ప్రభుత్వం తేల్చనున్నది. గత ఎన్నికల్లో 28 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలన్నది యోచన. నివేదిక ప్రకారం పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదానికి పంపనున్నది. రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని ఆమోదం పొందాల్సి ఉన్నది.
Telangana: ఈ దశలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక ప్రతిపాదన చేశారు. రిజర్వేషన్ల పెంపు అంశంపై రాజ్యాంగ సవరణ ఇప్పట్లో సాధ్యం కాకపోతే, తమ పార్టీ పరంగా 42 శాతం సీట్లు బీసీలకు ఇస్తామని, మీరూ ఇచ్చేందుకు సిద్ధమా? అని బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదని తేలిపోయింది. దీంతో ఉన్న రిజర్వేషన్లతోనే నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Telangana: ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టు అధికార వర్గాల సమాచారం. రెండువారాల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారని, ఆ తర్వాత వారంగ గడువు ఇచ్చి పంచాయతీ ఎన్నికల పూర్తిచేయవచ్చని అంటున్నారు. మార్చి నెల మొదటి వారంలోనే ఇంటర్ పరీక్షలు, 21 నుంచి టెన్త్ పరీక్షలు ఉన్నందున.. ఆ లోగానే ఎన్నికల ప్రక్రియను ముగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో ఇప్పటివరకూ 5,810 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. గతంలో 5,857 స్థానాలు ఉండగా, తాజా జాబితాలో వాటి సంఖ్య 47కు తగ్గింది. రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్‌లు, 570 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ నివేదించింది.