Telangana News: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలైన డాక్టర్ ప్రీతిరెడ్డి మానవత్వం చాటారు. విమానంలో వస్తుండగా తోటి ప్రయాణికుడిని ప్రాణాపాయం నుంచి కాపాడి మన్ననలు పొందారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆమె అకస్మాత్తుగా జరిగిన ఘటనకు స్పందించడంపై తోటి ప్రయాణికులు మెచ్చుకున్నారు.
Telangana News: ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న 74 ఏండ్ల వృద్ధుడు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
స్పృహ కోల్పోయి, నోటి నుంచి నురగలు కక్కుతుంటంతో తోటి ప్రయాణికులు ఆందోళన చెందారు. సరిగ్గా అదే సమయంలో అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ ప్రీతిరెడ్డి క్షణాల్లోనే స్పందించారు.
Telangana News: స్పృహ కోల్పోతున్న ఆ వృద్ధుడి వద్దకు చేరుకుని ఆయన పల్స్ పరీక్షించారు. రక్త ప్రసరణ రేటు బాగా తగ్గిపోయిందని గుర్తించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె వెంటనే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేయసాగారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే ఆ వృద్ధుడు స్పృహలోకి వచ్చాడు. ప్రాథమిక చికిత్సతో ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Telangana News: హైదరాబాద్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవగానే ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆ వృద్ధుడిని అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించారు. విమానంలోని తోటి ప్రయాణికుడిని ప్రాణాపాయం నుంచి కాపాడిన డాక్టర్ ప్రీతిరెడ్డిని ఇతర ప్రయాణికులు ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె చూపిన చొరవ, సమయస్ఫూర్తి ఇతరులకు ఆదర్శమని కొనియాడారు.

