Philippines: ఎంబీబీఎస్ చదివేందుకు ఫిలిప్పీన్స్ దేశం వెళ్లిన తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకున్నది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న చింత అమృత్‌రావు కుమార్తె చింత స్నిగ్ధ (17) ఆదేశంలో మృతి చెందినట్టు వచ్చిన వార్త ఆ కుటుంబంలో విషాదం నింపింది. చింత స్నిగ్ధ ఫిలిప్పీన్స్ దేశంలోని పర్పెక్చువల్ హెల్త్ యూనివర్సిటీ మనీలాలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.
Philippines: శుక్రవారం తెల్లవారు జామున స్నిగ్ధ చనిపోయినట్టు తోటి విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. అయితే ఇదేరోజు స్నిగ్ధ పుట్టినరోజు కావడం గమనార్హం. పుట్టినరోజే చనిపోయిన వార్త తెలిసిన ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు విషాదంలో మునిగిపోయారు. ఎందుకు మరణించిందనే విషయం తేలాల్సి ఉన్నది.