Telangana: తెలంగాణలో కీలక పదవుల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి వారిని రిలీవ్ చేసి, 24 గంటల్లోగా ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని సూచించింది. ఈ ముగ్గురు ఐపీఎస్‌లు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి.
డీజీ ర్యాంక్‌లో ఉన్న అంజనీ కుమార్ గతంలో తెలంగాణ డీజీపీగా పనిచేశారు, ఆయన ఏపీ క్యాడర్‌కి చెందిన అధికారిగా కొనసాగుతున్నారు. అభిలాష బిస్త్ ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు, అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Nallagonda: కూతురుపై తండ్రి లైంగికదాడి.. కోర్టు సంచలన తీర్పు
తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి వీరు ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. విభజన సమయంలో కేంద్రం వీరిని ఏపీకి కేటాయించినప్పటికీ, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్‌లో పిటిషన్ వేశారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉండగానే, తాజాగా కేంద్రం వీరికి 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయంపై సంబంధిత ఐపీఎస్‌లు మరింత సమయం కోరే అవకాశం ఉంది. ఇదే విధంగా, మూడు నెలల క్రితం కేంద్రం ముగ్గురు ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసిన సంగతి తెలిసిందే.