TS Inter Results 2025: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2025 సంవత్సరానికి సంబంధించి ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ రోజు (ఏప్రిల్ 22) అధికారికంగా విడుదల చేసింది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫలితాలను ప్రకటించారు.
ఇంటర్‌లో ఫస్టియర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి కూడా అమ్మాయిలే అగ్రస్థానాల్లో దూసుకెళ్లారు. టాప్ ర్యాంకులు, ఉత్తమ మార్కులు అందరూ అమ్మాయిలదే కావడం విశేషం.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు తెలుసుకునేందుకు అధికారిక tgbie.cgg.gov.in లో చూసుకోవచ్చు. దింతో పాటు ఐవీఆర్ సర్వీస్ (9240205555) కూడా అందుబాటులో ఉంది.
పరీక్షల వివరాలు
ఈ సంవత్సరం మొత్తం 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 5 నుండి 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1532 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి. 4.88 లక్షల మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 5 లక్షలకు పైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు.
ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, గ్రేడ్స్‌కు బదులుగా మార్కులను ప్రకటించారు. ఇది విద్యార్థులకు స్పష్టతను అందించే విధంగా ఉంది.
సప్లిమెంటరీ, రీవాల్యుయేషన్ వివరాలు
తక్కువ మార్కులు వచ్చినవారు లేదా ఫెయిల్ అయినవారు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. ఈ పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు త్వరలో ప్రకటించనుంది. మార్కుల్లో సందేహాలున్న విద్యార్థులు రీవాల్యుయేషన్ లేదా రీకౌంటింగ్‌కి అప్లై చేసుకోవచ్చు.