Kalpika: సినీ నటి కల్పికా గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆమెపై నమోదైన రెండు కేసుల్లో తక్షణమే అరెస్టు చేయవద్దని హైకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. అయితే, దర్యాప్తునకు సహకరించాలని కల్పికకు సూచించింది.
కల్పికపై ఇటీవల రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒకటిగచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించింది. పబ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. ఘర్షణ సమయంలో కల్పిక వ్యవహరించిన తీరుపై సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: Nandamuri Balakrishna: పార్లమెంట్‌లో బాలకృష్ణ సైకిల్ రైడ్
రెండవ కేసు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కొందరు వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, తప్పుదారి పట్టించే విధంగా పోస్టులు పెడుతున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ విభాగం కూడా కల్పికపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
ఈ రెండు కేసుల నుంచి అరెస్టు నుంచి రక్షణ కోరుతూ నటి కల్పిక హైకోర్టును ఆశ్రయించారు. ఆమె విజ్ఞప్తిని పరిశీలించిన హైకోర్టు, ఈ రెండు కేసులలో కల్పికను తొందరపాటుగా అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, దర్యాప్తు అవసరాల కోసం పోలీసులు పిలిచినప్పుడు కల్పిక తప్పనిసరిగా సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో కల్పికకు ప్రస్తుతానికి ఊరట లభించినట్లయింది.