Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి రానుంది. ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ అండ్ టీ గ్రూప్ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్ మధ్య గురువారం జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం ఖరారైంది. ఈ ఒప్పందంతో దేశంలో ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న ఏకైక మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది.
ఒప్పందం వివరాలు..
ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో రైలు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.13,000 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది. అలాగే, ఎల్ అండ్ టీకి ఈక్విటీ వాటాగా రూ.2,000 కోట్లు వన్-టైమ్ సెటిల్‌మెంట్‌గా చెల్లించేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం పూర్తయితే, మొదటి దశలోని 72 కిలోమీటర్ల మూడు కారిడార్లు పూర్తిగా ప్రభుత్వం నిర్వహణలోకి వస్తాయి.
.
మెట్రో రెండో దశకు మార్గం సుగమం..
మెట్రో రెండో దశ విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 8 కొత్త కారిడార్లతో 163 కిలోమీటర్ల మేర ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. అయితే, మొదటి దశ ఎల్ అండ్ టీ వద్ద ఉండటం వల్ల కేంద్రం అనుమతులు ఆలస్యమవుతున్నాయి. కేంద్రం సూచనల మేరకు, రెండు దశల మధ్య సమన్వయం కోసం ఒప్పందం కుదర్చాలని, లేదంటే రెండో దశకు అనుమతులు ఇవ్వడం కష్టమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఎల్ అండ్ టీ రెండో దశలో భాగస్వామ్యం లేదా ఉమ్మడి నిర్వహణకు అంగీకరించకపోవడంతో, మొదటి దశను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది.
గురువారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్, సంస్థ సీఎండీ సలహాదారు డి.కె.సేన్, ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్ ఎండీ కె.వి.బి.రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పట్టణ రవాణా సలహాదారు ఎన్.వి.ఎస్.రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మెట్రో రైలు ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Asia Cup Final 2025: భారత్ vs పాకిస్తాన్.. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారి
ఎల్ అండ్ టీ ఎందుకు వెనక్కి?
ఎల్ అండ్ టీ సంస్థ రవాణా వ్యాపారం నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. రెండో దశలో ఈక్విటీ భాగస్వామిగా కొనసాగడానికి లేదా రెండు దశల ఉమ్మడి నిర్వహణ ఒప్పందంపై సంతకం చేయడానికి అంగీకరించలేదు. బదులుగా, తమ వాటాను రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. మెట్రో నిర్వహణలో ఆర్థిక భారం, ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం, కరోనా సమయంలో సేవలు నిలిపివేయడం, అధిక వడ్డీ రుణాలు వంటి కారణాలతో ఆర్థిక ఒత్తిడి పెరిగిందని ఎల్ అండ్ టీ వాదిస్తోంది. అయితే, సంస్థ నిర్వహణలో లోపాలే ఈ ఆర్థిక సమస్యలకు కారణమని విమర్శలు కూడా ఉన్నాయి.
మెట్రో విస్తరణ లక్ష్యం..
రెండో దశలో ఓల్డ్ సిటీ, ఎయిర్‌పోర్ట్, మేడ్చల్, శామీర్‌పేట, పటాన్‌చెరు, ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో సేవలను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో కేంద్రం నుంచి రెండో దశకు అనుమతులు త్వరగా వచ్చే అవకాశం ఉంది. దీనితో హైదరాబాద్ మెట్రో దేశంలోని ఇతర మెట్రోల మాదిరిగా ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడుతుంది.
ఎల్ అండ్ టీ సంస్థ రూ.5,900 కోట్ల ఈక్విటీ వాటా కోసం రూ.2,000 కోట్లు చెల్లించాలని ప్రతిపాదించింది. అంతకుముందు 2022లో రూ.3,000 కోట్ల ఒప్పందంలో రూ.900 కోట్లు చెల్లించగా, రూ.2,100 కోట్లు బాకీ ఉన్నాయని సంస్థ పేర్కొంది. ఈ ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం రూ.2,000 కోట్ల సెటిల్‌మెంట్‌తో పాటు రూ.13,000 కోట్ల రుణ బాధ్యతను స్వీకరించేందుకు అంగీకరించింది.
భవిష్యత్తు ప్రణాళిక..
ఈ ఒప్పందంతో మెట్రో రెండో దశ పనులు వేగవంతం కానున్నాయి. వచ్చే మూడేళ్లలో రెండో దశను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ నగర జనాభా, రవాణా అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో, మెట్రో విస్తరణ నగర భవిష్యత్తుకు కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా హైదరాబాద్ మెట్రో దేశంలోని ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల మెట్రోల మాదిరిగా ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది.