తెలంగాణలో నిన్న వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో తండ్రికొడుకులు సత్తా చాటారు. నారాయణపేట జిల్లా రాకొండకు చెందిన గోపాల్, అతని కుమారుడు భానుప్రకాశ్ ర్యాంకులు సాధించారు. తెలుగు పండిట్‌గా జిల్లాలో గోపాల్‌కు ఫస్ట్ ర్యాంక్ రాగా, మ్యాథ్స్ సబ్జెక్టులో భాను ప్రకాశ్‌కు 9వ ర్యాంక్ వచ్చింది. గోపాల్ భార్య విజయలక్ష్మి ఇదివరకే తెలుగు పండిట్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలల క్రితం వారి రెండో కుమారుడు చంద్రకాంత్ కూడా గవర్నమెంట్ జాబ్‌కు(ఏఈఈ) సెలక్ట్ అయ్యాడు.
ఇదే జిల్లా కోస్గి మండలం ముక్తిపహాడ్ గ్రామానికి చెందిన ఈడ్గి కృష్ణయ్య స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లాస్థాయిలో రెండో ర్యాంకు సాధించగా.. ఆయన సోదరుడు ఈడ్గి రమేశ్ ఎస్‌జీటీ విభాగంలో జిల్లాలో 11వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. కాగా డీఎస్సీ ఫలితాలను సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు. పరీక్షలు నిర్వహించిన 55 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.