Revanth Reddy: ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహాజాతరకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారని దృష్టిలో పెట్టుకొని, భక్తులకు సౌకర్యాలు కల్పించే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకోనున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు సీతక్క, సురేఖ, లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు.
మొదటగా అమ్మవారి గద్దెల విస్తరణ పనులను పరిశీలించి, పూజారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని ఆశీస్సులు అందుకుంటారు. దర్శనం అనంతరం అధికారులతో సమావేశమై డిజిటల్ ప్లాన్ ఆధారంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసే అంశాలపై చర్చిస్తారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలగకుండా, మేడారాన్ని అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తరువాత సీఎం స్వాగత తోరణాలు, భక్తుల రాకపోకలు సులభతరం చేసే మార్గాలు, జంపన్నవాగులో పుణ్యస్నానం వంటి సౌకర్యాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
ఇక సీఎం పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే మంత్రి సీతక్క స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్‌తో పాటు అధికారులు కలిసి హెలిప్యాడ్, గద్దెల పరిసర ప్రాంతాల్లోని సదుపాయాలను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.