Telangana Cabinet:తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీ నవంబర్ 15న జరుగుతుంది. వాస్తవంగా నవంబర్ 7న నిర్వహించాలని తొలుత భావించారు. ఆ తర్వాత 12న భేటీ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ, జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల అనంతరం నిర్వహిస్తే కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే భావనతో 15కు మార్పు చేసినట్టు తెలుస్తున్నది. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నది. ఆ తర్వాతి రోజైన 15న సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ ఉంటుంది.
Telangana Cabinet:జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఫలితంపై అధికార పార్టీ ధీమాతో ఉన్నది. జాతీయ సర్వే సంస్థలు ఒకటి, రెండు మినహా అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన అంచనాల్లో కూడా గెలుపు తమదేననే నిర్ణయానికి వచ్చింది. పార్టీ శ్రేణులు, నాయకులు, మంత్రుల ద్వారా సేకరించిన సమాచారంలోనూ పక్కాగా కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాలో ఉన్నారు.
Telangana Cabinet:ఈ నేపథ్యంలో నవంబర్ 15న మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, కాంగ్రెస్ సర్కారు రెండేళ్ల పాలన విజయోత్సవాలు, ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఏకంగా బీసీ రిజర్వేషన్లపై, స్థానిక ఎన్నికల నిర్వహణఫై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నది.

