Teja Sajja: సినిమాలకు సంబంధించిన యాక్షన్ సీన్స్ షూటింగ్ సమయంలో హీరోలు గాయపడటం తరచూ జరిగేదే! యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… కొన్ని సార్లు ఫైటర్స్ కు హీరోలకు మధ్య సమన్వయ లోపంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. అలానే ఫైట్ సీన్స్ కు సంబంధించిన రిహార్సిల్స్ సమయంలోనూ యాక్సిడెంట్స్ కు ఆస్కారం ఏర్పడుతుంది. ఆ మధ్య రవితేజ తన 75వ సినిమా షూటింగ్ టైమ్ లో గాయపడ్డాడు. తాజాగా యంగ్ హీరో తేజ సజ్జా కూడా ‘మిరాయ్’ షూటింగ్ లో గాయాలకు లోనయ్యాడు. ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తున్న తేజ సజ్జా కుడి చేతి మణికట్టు కు కట్టు ఉండటం కనిపించింది. దీనిపై ఆరా తీయగా ‘మిరాయ్’ షూటింగ్ టైమ్ లో చేతికి గాయం అయినట్టు తెలిసింది. అయితే ఇది కంగారు పడాల్సినంత పెద్ద గాయం కాదని, వచ్చే షెడ్యూల్ లో తిరిగి యథాతథంగా పాల్గొనబోతున్నాడని సన్నిహితులు తెలిపారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘మిరాయ్’ సినిమా వచ్చే యేడాది మార్చిలో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ‘హనుమాన్’ తర్వాత వస్తున్న తేజ సజ్జా మూవీ ఇదే!
