Teenmar Mallanna:ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై ఆదివారం (జూలై 13) కొందరు దాడికి దిగారు. ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసినందునే తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. హైదరాబాద్ మేడిపల్లిలో ఉన్న తీన్మార్ మల్లన్న కార్యాలయంపైనే ఈ దాడి జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయంలో కంప్యూటర్లు, ఇతర సామగ్రిని ధ్వంసం చేయడంతోపాటు అక్కడి కొందరు సిబ్బందిపై కూడా దాడికి దిగారు.
Teenmar Mallanna:తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి సందర్భంగా ఆయన గన్‌మెన్ ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈలోగా స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగినట్టు సమాచారం.
Teenmar Mallanna:ఇదిలా ఉండగా, తనపై కవిత అనుచరులే దాడికి పాల్పడ్డారని తీన్మార్ మల్లన్న తెలిపారు. తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. కవితతో కలిసి తిరిగిన వారే తమ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకే తన గన్‌మెన్ గాలిలోకి కాల్పులు జరిపారని ఆరోపించారు.