Teenmar Mallanna: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఇది ఆసక్తికర సన్నివేశం అనుకోవచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ను, ఆ పార్టీ కీలక నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తదితరులపై వ్యంగ్య ధోరణితో తన యూట్యూబ్ చానల్ ద్వారా ఆరోపణలు గుప్పించిన తీన్మార్ మల్లన్న ఈ రోజు (మార్చి 17) కలవడం ఆసక్తికరంగా మారింది.
Teenmar Mallanna: ఈ రోజు బీసీ బిల్లు ప్రవేశపెట్టక ముందే తీన్మార్ మల్లన్న వారిద్దరినీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ బిల్లుపై చర్చించారు. బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేపట్టబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారితో పాటు బీఆర్ఎస్ నేతలను తీన్మార్ మల్లన్న కోరారు. బీసీ బిల్లు కేవలం ప్రవేశపెట్టి చేతులు దులుపుకోవడం కాదని, అవసరమైతే తాము ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని చెప్పారు. ఈ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీలో మద్దతు ఇవ్వడంతోపాటు గట్టిగా నిలదీయాలని కోరారు.

