Microsoft: ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ తిరిగి ఉద్యోగుల తొలగింపుల దిశగా అడుగులు వేసింది. కంపెనీ తాజాగా 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ చర్యలు సంస్థ ఆపరేషన్లలో కృత్రిమ మేధ (AI), ఆటోమేషన్ వినియోగాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది.
సియాటిల్ టైమ్స్ నివేదిక ప్రకారం, తాజా కోతలు ప్రధానంగా మైక్రోసాఫ్ట్ వాషింగ్టన్ కార్యాలయంలో చోటుచేసుకున్నాయి. తొలగింపులు మొత్తం సిబ్బందిలో 1 శాతానికి కూడా చేరలేదు కానీ, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రాడక్ట్ మేనేజర్‌లపై ప్రభావం చూపినట్లు సమాచారం.
ఇది మైక్రోసాఫ్ట్ చేపట్టిన ఒక్కో విడత లేఆఫ్‌లలో తాజా ఘట్టం. ఇప్పటికే గత నెలలో సంస్థ దాదాపు 6వేల మంది ఉద్యోగులను తొలగించింది. 2023లో 10,000 మంది ఉద్యోగుల తొలగింపు తర్వాత ఇది రెండో అతిపెద్ద దశగా నిలిచింది. అప్పట్లో సిబ్బందిలో 3 శాతానికి లేఆఫ్‌లు అమలు చేశారు.
మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ప్రకారం, సంస్థ మార్కెట్ పోటీలో ముందంజలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకొని, కీలకమైన వ్యాపార రంగాల్లో దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ దిశగా ఏఐ ఆధారిత సాధనాలు, ఆటోమేషన్ సాధనాల వినియోగాన్ని వేగవంతం చేస్తోంది. కోడింగ్, డిజైన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వంటి ప్రక్రియలను మెరుగుపరచడంలో “Copilot” వంటి సాధనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Also Read: Google Pixel 10: ఇదెక్కడి మాస్ రా మావా.. గూగుల్ నుంచి అదిరే ఫోన్లు..!
Microsoft: మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు, మెటా, సేల్స్‌ఫోర్స్, గూగుల్ వంటి టెక్ కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఈ సంస్థలు AI, మిషన్ లెర్నింగ్ ఆధారిత టూల్స్ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తూ, తక్కువ వనరులతో ఎక్కువ పనితీరు సాధించే లక్ష్యంతో సిబ్బందిని తగ్గిస్తున్నాయి.
సేల్స్‌ఫోర్స్ ఇటీవల ఏఐ ఆధారంగా కార్యకలాపాలు విస్తరిస్తున్నందున తక్కువ ఉద్యోగులతో ముందుకెళ్తున్నట్లు ప్రకటించింది. ఇది టెక్ రంగంలో మారుతున్న ధోరణుల స్పష్ట నిదర్శనం.
తాజా చర్యలతో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల్లో భారీ మార్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. సంస్థలోని మేనేజ్‌మెంట్ స్థాయిలను కూడా సర్దుబాటు చేస్తూ, వ్యాపార ప్రాధాన్యాలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఈ మార్పులు, భవిష్యత్తులో ఏఐ ఆధారిత టెక్నాలజీలతో ముందంజలో ఉండే వ్యూహంలో భాగంగా భావించబడుతున్నాయి.