IND vs SA: జొహానెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికా, భారత్ మధ్య మరో ఆసక్తికర సమరం జరగనుంది. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా ఆఖరిదైన నాలుగో టీ20లో నేడు సఫారి జట్టును ఢీకొట్టనుంది. 2-1 ఆధిక్యంతో సిరీస్ కోల్పోయే అవకాశం లేని స్థితిలో ఉన్న భారత్.. రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై సిరీస్ చేజారనివ్వకూడదన్నది దక్షిణాఫ్రికా పట్టుదల. కాగా, వాండరర్స్ లో భారత్ కు మంచి రికార్డుంది. ఇక్కడే 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలిచి విశ్వవిజేత కిరీటాన్ని మనం సగర్వంగా అందుకున్నాం. కాగా, గతంలో వాండరర్స్‌లో ఆడిన మ్యాచ్‌లో సూర్య సెంచరీతో విజృంభించాడు. తాజా సిరీస్‌లో ఇప్పటికే భారత్ తరఫున సంజూ సామ్సన్, తిలక్ వర్మ సెంచరీలు సాధించగా మరి సిరీస్ ఆఖరి మ్యాచ్ లో ఎవరు కొడతారో..? ఎవరు హిట్టవుతారో..? ఆసక్తికరంగా ఉంది. మూడు మ్యాచ్‌ల్లో రెండు సార్లు 200 పైగా స్కోరు చేయడం.. ఓడిన మ్యాచ్‌లోనూ మెరుగైన పోరాటంతో టీమిండియా టీ20ల్లో మెరుగైన ప్రదర్శనతోనే కనిపిస్తోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ విజతగా నిలవడంతో పాటు అద్భుత విజయాలు సాధిస్తున్న టీమిండియాకు ఈ ఏడాదిలో ఇదే చివరి టి20 మ్యాచ్ కాగా… ఇందులోనూ విజయం సాధించాలని సిరీస్ దక్కించుకోవాలని ఆరాటపడుతోంది.
IND vs SA: ఈ సిరీస్ లో తొలి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో నెగ్గిన భారత్.. మూడో మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో గెలిచింది. ఇక లోస్కోర్లు నమోదైన రెండో టీ20లో దక్షిణాఫ్రికా విజయాన్ని అందుకుంది. రెండు విజయాలు సాధించినా.. బ్యాటింగ్‌లో మాత్రం టీమిండియా తడబడుతోంది. జట్టు ఓపెనర్ సంజు శాంసన్, హైదరబాదీ తిలక్ వర్మల సెంచరీలు సిరీస్‌లో ఆధిక్యం లో నిలిపాయి కానీ..జట్టుగా బ్యాటుతో భారత్ ప్రదర్శన గొప్పగా లేదు. దీంతో ఆఖరి టీ20లో జట్టుగా సమిష్టిగా మెరిస్తేనే విజయం దక్కుతుంది. సెంచరీ తర్వాత సంజు శాంసన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. కీలక బ్యాటర్, టీ20 కెప్టెన్ సూర్య కుమార్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి 26 పరుగులే చేయగలిగాడు. హార్దిక్ పాండ్యా కూడా రాణించలేకపోతున్నాడు. గతంలోలా సౌతాఫ్రికాలో ధాటిగా ఆడలేకపోతున్నాడు. ఆఖరి మ్యాచ్ లో విజయంతో సిరీస్ దక్కించుకోవాలంటే బ్యాటుతో, బంతితో అతడు పుంజుకోవడం చాలా కీలకమన్నది వాస్తవం. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్ అభిషేక్ శర్మ.. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఫామ్‌ను అందుకోవడం టీమిండియాకు శుభసూచకం. అయితే రింకు సింగ్ ఫామే మరింత ఆందోళన కలిగిస్తోంది. టీ20స్పెషలిస్ట్‌గా తన విధ్వంసక ఆట ఆడే అతను హఠాత్తుగా గత కొన్ని నెలల్లో ఫామ్‌కోల్పోయాడు. దక్షిణాఫ్రికాలో మూడు మ్యాచ్‌ల్లో కలిపి 28 పరుగులే చేయగలిగాడు. అత్యధికం 11 మాత్రమే. రింకు ఫాం అందుకుంటే మనకు మంచిది. తర్వాతి టీ20 ప్రపంచకప్ 2026లో ఉన్న నేపథ్యంలో.. రింకును గాడిన పడేయడానికి కెప్టెన్ సూర్యకుమార్‌కు తగినంత సమయం ఉండడంతో అతని సమస్యకు పరిష్కారం కనిపెట్టే అవకాశముంది.
IND vs SA: సిరీస్‌ను కాపాడుకోవాలనుకుంటున్న సఫారీ టీమ్ బ్యాటింగ్‌లో రాణించాల్సి ఉంది. ముఖ్యంగా కెప్టెన్ మార్‌క్రమ్, మిల్లర్ నిలకడగా పరుగులు చేస్తేనే సౌతాఫ్రికా విజయం సాధ్యం. బ్యాటింగ్ లో క్లాసెస్ మెరుపులు.. యాన్సెన్ ఆల్‌రౌండ్ జోరు తప్ప సౌతాఫ్రికా జట్టులో అంతగా బ్యాటింగ్ కనిపించడం లేదు. చివరి టీ20లోనూ హార్డ్‌హిట్టర్ క్లాసెన్ జోరు కొనసాగించాలని దక్షిణాఫ్రికా కోరుకుంటోంది. మరోవైపు ఆ జట్టు బంతితోనూ పుంజుకోవాల్సివుంది. జొహానెస్‌బర్గ్‌లో పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. చివరిసారి ఇక్కడ 2023 డిసెంబరులో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కొట్టడంతో భారత్ 7 వికెట్లకు 201 పరుగులు చేసింది.
IND vs SA: దక్షిణాఫ్రికాను 95కే ఆలౌట్ చేసి ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ఆరంభానికి ముందు జల్లులు పడే అవకాశమున్నా మ్యాచ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ సిరీస్‌లో ఇంకా ముగ్గురు భారత ఆటగాళ్లు ఆడలేదు. నాలుగో మ్యాచ్ కోసం తుది జట్టులో ఏమైనా మార్పులు చేస్తారో లేదో చూడాలి. పిచ్ స్వభావాన్ని బట్టి అదనపు పేసర్ కావాలనుకుంటే.. ఇంకా డెబ్యూ చేయని యశ్ దయాళ్, వైశాఖ్ విజయ్ కుమార్‌లలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. రమణ్‌దీప్‌ను కొనసాగించే అవకాశముంది. టీమిండియా సిరీస్ దక్కించుకునేందుకు..సఫారీ టీమ్ సిరీస్ సమం చేసేందుకు హోరహోరీగా తలపడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.