Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చే విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీసీబీ ఏం చేయాలో తెలియని గందరగోళంలో పడింది. ఈ టోర్నీ ఆడేందుకు పాకిస్థాన్ వెళ్లేదే లేదని ఐసీసీకి బీసీసీఐ తేల్చిన నేపథ్యంలో టోర్నీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహించాలని ఐసిసి కోరుతున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశంలోనే టోర్నీని నిర్వహించాలనే మొండి పట్టుదలతో ఉన్న పాకిస్థాన్ .. ఈ విధానానికి నిరాకరిస్తోంది. గతేడాది ఆసియాకప్‌నకు పాక్ ఆతిథ్యమిచ్చినప్పుడు హైబ్రిడ్ విధానంలో భారత్ తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ తమ దేశానికి రావాల్సిందేనని మొండి పట్టుపడుతోంది.
Champions Trophy: అయితే ఈ ట్రోఫీ నిర్వహణపై ప్రభావం పడితే మాత్రం పీసీబీకి తీవ్రమైన ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. టోర్నీ నిర్వహణ నుంచి పాక్ తప్పుకొంటే పీసీబీకి అందించే నిధుల్లో ఐసీసీ కోత విధించే అవకాశముంది. టోర్నీని మరో దేశానికి తరలించినా లేదా వాయిదా వేసినా ఆతిథ్య ఫీజు కింద పాక్‌కు దక్కాల్సిన సుమారు రూ.548 కోట్లు రాకుండా పోతాయి. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాక్‌కు ఇది గట్టిదెబ్బే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి పాకిస్థాన్ ఏం చేస్తుందో.. ఈ సంకటస్థితి నుంచి ఎలా బయటకు వస్తుందో ఉత్కంఠగా మారింది.