Team India

Team India: ఇలా అయితే కష్టమే!

Team India: బెంగళూరులో పేస్ కు పడ్డారు.. పుణెలో స్పిన్ కు కుప్పకూలారు.. ఇదీ టెస్టుల్లో రోహిత్ సేన దారుణ పరిస్థితి. గతంలో విదేశీ గడ్డపై మాత్రమే పేస్ బౌలింగ్ ఫేస్ చేయలేక పోయేది టీం ఇండియా. స్వదేశంలో పులి.. విదేశీ గడ్డపై పిల్లి అనేవారు టీమిండియాను. కనీసం స్వదేశంలోనైనా పులిలా గర్జించే వారు .. కానీ ఇప్పుడు టీమిండియాను చూస్తుంటే పేస్ కు నిలబడలేరు..స్పిన్ ఆడలేరన్నట్లుగా కనిపిస్తోంది. కివీస్ తో టీమిండియా ఆటతీరు పరమ చెత్తగా ఉంది.

Team India: ఇటీవలి కాలంలో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆడలేకపోవడం ఆందోళనగా కలిగిస్తున్నది. ఎంతలా అంటే అనామక స్పిన్నర్లూ వికెట్ల పంట పండించుకునేలా మన బ్యాటర్లు ఆడుతున్నారు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పిచ్‌ పేస్‌కు అనుకూలించడం వల్లే టీమిండియా తడబడింది అని సర్దిచెప్పుకున్న వాళ్లు సైతం… పుణే ప్రదర్శనతో అవాక్కయ్యారు. ప్రత్యర్థిని స్పిన్‌ వలలో వేసి ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్న రోహిత్‌ సేన చివరకు ఆ ఉచ్చులోనే చిక్కి విలవిలలాడుతోంది. టెస్టు కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాలుగు కంటే ఎక్కువ వికెట్లు తీసిన అనుభవం లేని కివీస్ స్పిన్నర్ సాంట్నర్‌కు ఏకంగా మనవాళ్లు ఏడు వికెట్లు సమర్పించుకోవడంతో టీమిండియా ఫ్యాన్స్ జట్టు బ్యాటర్లపై మండిపడుతున్నారు.

Team India: టెస్టులంటే టీ20లా పరుగులు చేయడం కాదు.. సెషన్ల కొద్దీ క్రీజులో పాతుకుపోవాలి.. గంటల కొద్దీ బ్యాటింగ్ చేయాలి..పరిస్థితులకు తగినట్లుగా ఆడాలి.. వేగంగా ఆడడమే క్రికెట్ అన్నట్లుగా మారిపోయిన టీమిండియా బ్యాటర్లు, టెస్టు క్రికెట్ మూల సూత్రం మరిచి పోయారు. బజ్ బాల్.. లేదా గాంబాల్ ఆట ఆడుదామన్నట్లుగా రావడం …వేగంగా పరుగులు చేయాలని ప్రయత్నించడం ..ఔట్ కావడం ఇదే తంతు కొనసాగుతోంది. వికెట్లు పడుతుంటే క్రీజులో నిలదొక్కుకోవాలన్న తపన ఏ ఒక్క బ్యాటర్ కూ కనిపించలేదు. పుణె లో భారత ఆటగాళ్లు తడబడ్డ చోటే రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్‌ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు చేస్తున్నారు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో కివీస్ బ్యాటర్లు లాథమ్, రచిన్ రవీంద్ర క్రీజు వదలి ఒక అడుగు ముందుకు వేసి బంతిని అందుకోవడంతో పాటు… కాళ్ల కదలికలో చురుకుదనం చూపిస్తూ ఖాళీల్లోకి బంతిని పోనిచ్చి పరుగులు సాధిస్తున్నారు. మన బ్యాటర్లు మాత్రం వికెట్లు సమర్పించి పెవిలియన్ కు వెళుతున్నారు.

Team India: వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరాలనుకుంటున్న టీమిండియా… ఇదే ప్రదర్శన కొనసాగిస్తే మున్ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదు. 2023–25 ఎడిషన్‌లో భాగంగా భారత్‌ ఇంకా కేవలం ఆరు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అందులో ఒకటి న్యూజిలాండ్‌తో చివరి టెస్టు మ్యాచ్ కాగా..మిగిలిన ఐదు ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ సందర్భంగా ఆడాల్సి ఉంది. ఇలాంటి దశలో స్వదేశంలో ఆడుతున్న సిరీస్‌లో సంపూర్ణ ఆధిపత్యంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితితో ఆసీస్‌ గడ్డపై అడుగు పెడుతుంది అనుకుంటే… ఫలితాలు మాత్రం నిరాశను కలిగిస్తున్నాయి. బెంగళూరు టెస్టులో భారత మాజీ కెప్టెన్ , మాజీ హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే మాట్లాడుతూ… ‘జట్టులో పుజారా వంటి ప్లేయర్‌ ఎంతో అవసరం. ఎలాంటి పిచ్‌పైనైనా ఓపికగా నిలవడంతో పాటు సహచరులకు భరోసా ఇవ్వగల సామర్థ్యం అతడి సొంతం’ అని అన్నాడు. ఇప్పుడు వరుసగా రెండో టెస్టులోనూ మన బ్యాటర్ల ఆటతీరు చూస్తుంటే కుంబ్లే చెప్పింది నిజమే అనిపిస్తోంది. జట్టులో పుజారాను మళ్లీ చేర్చకపోయినా..అతనిలాంటి ప్లేయర్ ను తయారు చేసుకోవడంలో టీమిండియా ఫెయిలైంది.

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Team India: స్వదేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే… ఆ్రస్టేలియా టూర్‌లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మనం అద్భుత విజయాలు సాధించిన గత ఆసీస్‌ పర్యటనల్లో పుజారా క్రీజులో పాతుకుపోయి జట్టుకు మూలస్తంభంలా నిలిచి మరపురాని విజయాలు అందించాడు. మరి బెంగళూరు, పుణే పిచ్‌పైనే పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడుతున్న మనవాళ్లు కంగారూ గడ్డపై ఏం చేస్తారో వేచి చూడాలి. జట్టులో గిల్, పంత్, జైస్వాల్ సహా సర్ఫరాజ్ వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకుంటున్నారు. మరోవైపు కెప్టెన్ రోహిత్..కోహ్లీ అసలు పరుగులు చేయడమే మానుకున్నారు. దీంతో టీమిండియా కష్టాల్లో పడుతోంది. మరి మన పిచ్ లపైనే ఇలా ఉంటే ఆసీస్ గడ్డపై మన పరిస్థితి ఏంటో ? అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *