TDP Mahanadu 2025:కడప మహానాడు చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు. అంచనాలను అందుకుంటూ మూడ్రోజుల మహానాడులో తొలి రెండ్రోజుల కార్యక్రమాలన్నీ విజయవంతం అయ్యాయంటున్నారు. తొలి రెండ్రోజులు.. అంటే.. ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ కంప్లీట్ అయింది. ఇక మూడో రోజు క్లయిమ్యాక్స్ ఒక్కటే మిగిలింది. లోకేష్‌కి ప్రమోషన్ అయితే కన్ఫామ్ అయ్యింది. కానీ ఈ మహానాడులోనే ప్రమోషన్‌పై ప్రకటన ఉంటుందా? లేదా? అన్న అనుమానాలున్నాయ్. తొలి రెండ్రోజులు ఆ ప్రకటన లేకపోవడం.. మూడో రోజుపై తీవ్ర ఉత్కంఠను పెంచేస్తోంది. మరి రేపైనా ఆ ప్రకటన వెలువడుతుందా? వాయిదా వేస్తారా? వాయిదా అంటే ఎంత కాలం? ఆర్నెల్లా? ఏడాదా? తర్వాతి మహానాడు వచ్చే వరకా? మహానాడులో కీలకమైన మూడో రోజు ఏం జరగబోతోంది?
రేపటి రోజున మహానాడులో కీలక ఘట్టమైన మహా సభని నిర్వహించేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. రాయలసీమ ప్రాంతమైన కడపలో మొట్టమొదటి సారి మహానాడు వేదికని ఏర్పాటు చేసి అనేక తీర్మానాలు చేపట్టింది తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారి డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్‌ని ఉపయోగించి మహానాడుని నిర్వహించింది. విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో యువగళం రథసారధి నారా లోకేష్ అన్నీ తానై వ్యవహరించారు. ముందునుండి ప్రచారం నడుస్తున్నట్టే… యువనేత నారా లోకేష్‌ని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవాలన్న డిమాండ్ మహానాడు అన్ని వైపుల నుండి వినిపించింది. దీంతో.. రేపటి వేదికపై ఈ ప్రకటన ఉంటుందా? లేదా? అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది పసుపు సైన్యం.
పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగుతూనే.. లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పి, పార్టీని, క్యాడర్ని కాపాడుకునే దిశగా ముమ్మర ప్రయత్నాలే జరుగుతున్నాయని పేర్కొంటున్నాయి పార్టీ వర్గాలు. టీడీపీ 6 శాసనాలను అమల్లోకి తీసుకొచ్చి… రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తల్నే నేతలుగా తయారు చేస్తామన్న నారా లోకేష్ ప్రకటన టీడీపీ కార్యకర్తల్ని ఆకట్టుకుంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక అక్రమ కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలకు ఒక వెలుగు దీపం కనబడింది. దీంతో ఈ డిమాండ్ మరింత బలపడి.. లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పజెబితే.. మేమంతా సురక్షితంగా ఉంటామంటూ మహానాడుకు వచ్చిన ప్రతి ఒక్కరూ తమ మద్ధతు తెలపడం ద్వారా అధిష్టానంపై ఒత్తిడి పెంచేశారు.
ఇది కూడా చదవండి: Gaddar Film Awards: ‘గద్దర్’ అవార్డులు.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్.. బెస్ట్ సినిమాగా కల్కి..!
మరోపక్క.. ఇవాళ జరిగిన మహానాడు సభలో యువగళం పాదయాత్ర పుస్తకావిస్కరణ జరిగింది. పాదయాత్రలో తన దృష్టికొచ్చిన ప్రజల కష్టాలను అధినేత చంద్రబాబు కళ్లకు కట్టేవిధంగా లోకేష్ ప్రజెంట్ చేసిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. రెడ్‌బుక్‌లో ఎవరెవరి పేర్లున్నాయో, రాజారెడ్డి రాజ్యాంగం నడిపించిన వైసీపీ నేతలు ఎవరెవరో.. ప్రతి ఒక్కరిపై చర్యలుంటాయని మరోసారి తేల్చి చెప్పారు నారా లోకేష్. దీంతో కార్యకర్తల్లో మరింత ఉత్తేజం, ధైర్యం నింపినట్లైంది. లోకేష్ స్టేట్మెంట్స్తో… మహానాడు తర్వాత రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలపై పెట్టిన కేసులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన రద్దు చేసే ప్రయత్నాలు మొదలవుతాయంటున్నారు. రాబోయే నాలుగేళ్లలో టీడీపీ కార్యకర్తలను.. పార్టీని కాపాడుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందంటున్నారు.
మరోపక్క రెండ్రోజుల మహానాడు మొత్తం కూడా నారా లోకేష్ పైనే చర్చలు ఎక్కువగా జరిగాయి. కీలకమైన ఐటీ శాఖ, విద్యా శాఖలకు మంత్రిగా.. యువత కోసం లోకేష్ తపన, ఆవేదన, వివరించిన విధానం, రాబోయే రోజుల్లో 30 లక్షల మందికి ఉద్యోగాల హామీ నెరవేర్చి చూపిస్తామన్న ప్రతిజ్ఞ, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. లోకేష్‌కి పార్టీ పగ్గాలు అప్పజెప్పేందుకు… ఇది ముమ్మాటికీ ఫర్ఫెక్ట్ టైమ్ అంటూ దాదాపుగా తెలుగుదేశం కీలక నేతలంతా అధినేతకు తమ అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పేశారు. ప్రతి జిల్లా నుంచి కూడా ఇదే ప్రతిపాదన మోసుకొచ్చారు నేతలంతానూ. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు. మరి బాబు గారి ఫైనల్ డెజిషన్ ఎలా ఉండబోతోంది అనేది తెలియాలంటే… రేపు మధ్యాహ్నం వరకూ తమ్ముళ్లు ఈ ఉత్కంఠను బరించాల్సిందే.

