Tata Group: అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 275 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన టాటా గ్రూప్, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని దృఢ నిశ్చయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ. 500 కోట్లతో ఒక ప్రత్యేక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని టాటా సన్స్ బోర్డును అనుమతి కోరింది.
గురువారం జరిగిన ఒక ముఖ్యమైన బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఈ ఆలోచనను తీసుకువచ్చిన బోర్డు సభ్యులను అభినందించారు. ఈ సమావేశానికి టాటా ట్రస్ట్ నామినీలు నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ హాజరయ్యారు.
మొదట, టాటా సన్స్ భారతీయ బాధితుల కుటుంబాల కోసం ఒక ట్రస్ట్‌ను, విదేశీ బాధితుల కుటుంబాల కోసం మరొక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచించింది. అయితే, ప్రస్తుతం ఒకే ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా రెండు వర్గాల బాధితులకూ సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ ట్రస్ట్ ద్వారా కేటాయించబడే రూ.500 కోట్లను మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం, గాయపడిన వారికి వైద్య ఖర్చులు భరించడం, ప్రమాదంలో దెబ్బతిన్న మెడికల్ కాలేజీని తిరిగి నిర్మించడం, విమాన శకలాలు పడటం వల్ల నష్టపోయిన సమీప నిర్మాణాలను పునరుద్ధరించడం వంటి పనులకు వినియోగిస్తారు. మిగిలిన నిధులను బాధిత కుటుంబాల దీర్ఘకాలిక అవసరాలైన విద్య, ఉద్యోగావకాశాలు వంటి వాటికి వినియోగించాలని టాటా గ్రూప్ ప్రణాళిక వేస్తోంది. ఈ ట్రస్ట్ త్వరలోనే రిజిస్టర్ కానుంది.
Also Read: Donald Trump: భారత్‌తో భారీ ఒప్పందానికి అమెరికా సిద్ధం: డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
Tata Group: ఈ సంక్షోభాన్ని టాటా సంస్థ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎయిరిండియా రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ స్వయంగా తన చేతుల్లోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వంతో సంబంధాలు, ప్రయాణికుల భద్రత, విమానాల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం వంటి కీలక అంశాలను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. టాటా మోటార్స్ సీఎఫ్ఓ పీబీ బాలాజీ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. ఆయనకు ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలపై మంచి అనుభవం ఉంది.
తమ సంస్థలు కష్టాల్లో ఉన్నప్పుడు ఛైర్మన్లు స్వయంగా రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించడం టాటా గ్రూప్‌కు ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. గతంలో, 1989లో టాటా స్టీల్‌లో అగ్ని ప్రమాదం జరిగి 50 మంది మరణించినప్పుడు జేఆర్డీ టాటా స్వయంగా పరిస్థితిని చక్కదిద్దారు. అలాగే, టాటా ఫైనాన్స్ కుంభకోణం, 26/11 ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రదాడి జరిగినప్పుడు నాటి ఛైర్మన్ రతన్ టాటా నేరుగా రంగంలోకి దిగి వ్యవహారాలను పర్యవేక్షించారు. ఎన్. చంద్రశేఖరన్‌కు కూడా టీసీఎస్‌ను అనేక సంక్షోభాల నుంచి బయటపడేసిన అనుభవం ఉంది. తాజ్ హోటల్ ఉగ్రదాడి సమయంలోనూ టాటా గ్రూప్ ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, బాధిత ఉద్యోగుల కుటుంబాలకు దీర్ఘకాలిక మద్దతును అందించింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఎయిరిండియా ప్రమాద బాధితులను ఆదుకోవడానికి టాటా గ్రూప్ ముందుకు వచ్చింది.