Suryapet: పంట దిగుబడుల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలక్ష్యం కారణంగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఎందరో రైతులు నష్టపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం చేసిన సర్కారు, ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. దీంతో అన్నదాతలు రోడ్లెక్కి నిరసనలకు దిగుతున్నారు. తాజాగా మే 2న శుక్రవారం సూర్యాపేట జిల్లాలో రైతులు రాస్తారోకోకు దిగారు.
Suryapet: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేయడం లేదని నిరసిస్తూ సూర్యాపేట మండలం రాజునాయక్ తండాలో ప్రధాన రహదారిపై సమీప గ్రామాల రైతులు రాస్తారోకోకు దిగారు. లారీలు రావడం లేదనే సాకుతో కాంటాలు వేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. 5 రోజులకు ఒక లారీ చొప్పున వస్తే, ఎన్నిరోజులు కాంటాలు వేస్తారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే గ్రామ పరిధిలో గతంలో ఒకసారి రైతులు రాస్తారోకోకు దిగారు.
Suryapet: చాలా రోజులుగా ధాన్యం ఐకేపీ కేంద్రంలో ఉన్నదని, అకాల వర్షాలు, వడగండ్లతో తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే కాంటాలు మొదలుపెట్టాలని, ఉన్న అందరి ధాన్యాన్ని సకాలంలో కాంటాలు వేయాలని కోరారు. రైతులు రాస్తారోకోతో రోడ్డుపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసులు వచ్చి వారించినా రైతలు వినడం లేదు. అధికారులు సరైన హామీ ఇవ్వాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. వెంటనే కాంటాలు వేస్తామన్న హామీతో ఆందోళనను విరమించారు.

