surveyor incident: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రైవేటు సర్వేయర్ సజ్జ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజేశ్వర్ హత్యకు అతని భార్య ఐశ్వర్యే కారణమై, తన ప్రియుడు అయిన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో కలిసి ఈ దారుణాన్ని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య వెనుక చాలా రోజులుగా కొనసాగిన వ్యూహం, పలువురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తులో తేలింది.
ప్రేమ సంబంధమే ప్రాణం తీసింది
తేజేశ్వర్‌తో పెళ్లి అయ్యే ముందే ఐశ్వర్యకు తిరుమలరావుతో పరిచయం ఉండేది. తిరుమలరావు వివాహితుడే అయినా, ఐశ్వర్యతో ప్రేమలో పడ్డాడు. తేజేశ్వర్‌తో నిశ్చితార్థం రద్దయిన తరువాత కూడా, ఆమె ఇద్దరితోనూ ఫోన్ సంభాషణలు కొనసాగించింది. చివరకు తేజేశ్వర్ తన కుటుంబాన్ని ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య – తిరుమలరావు మధ్య సంబంధం మానలేదు.
భర్తను తొలగించేందుకు పన్నాగం
ఐశ్వర్య – తిరుమలరావు కలిసి తేజేశ్వర్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఐశ్వర్య అతని బైక్‌కి రహస్యంగా జీపీఎస్ ట్రాకర్ అమర్చింది. అతని కదలికల సమాచారాన్ని హంతకులకు అందించేది. పలు మార్లు హత్యకు ప్రయత్నించినా విఫలమయ్యారు.
చివరికి పక్కా ప్లాన్‌తో హత్య
తాజాగా తేజేశ్వర్‌ను భూమి సర్వే నెపంతో ఓ కారులో తీసుకెళ్లి, మార్గమధ్యంలో కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం శవాన్ని తాళ్లతో కట్టి, ఓ కవర్లో చుట్టి గాలేరు నగరి కాల్వలో పడేశారు.
8 మంది అరెస్ట్
ఈ కేసును విచారించిన పోలీసులు బ్యాంకు మేనేజర్ తిరుమలరావు, ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతతో పాటు హంతకుడు మనోజ్, అతని సహకారులు, డ్రైవర్, మధ్యవర్తి సహా 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.


