Suravaram Sudhakar Reddy: సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (83) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
సుధాకర్ రెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా కేర్ ఆస్పత్రికి వెళ్లి, ఆయన సతీమణి విజయలక్ష్మిని పరామర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఇక కుటుంబ సభ్యులు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహాన్ని గాంధీ ఆస్పత్రికి దానం చేయనున్నారు. ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరైన నిఖిల్ అమెరికాలో ఉన్నారు. శనివారం రాత్రి వరకు ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. అప్పటి వరకు సుధాకర్ రెడ్డి పార్థివదేహాన్ని కేర్ ఆస్పత్రి మార్చురీలో ఉంచనున్నారు.
ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభిమానులు, అనుచరుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని హిమాయత్‌నగర్‌లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి ర్యాలీగా తీసుకెళ్లి గాంధీ ఆస్పత్రికి దానం చేయనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
సమాజ సేవ, రాజకీయాలకు అంకితమై నిరాడంబరంగా జీవించిన సురవరం సుధాకర్ రెడ్డి మరణం దేశ రాజకీయాల్లో పెద్ద లోటు కలిగించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

