Suravaram Sudhakar Reddy: సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) కన్నూమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన గత కొన్నాళ్లుగా బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (ఆగస్టు 22న) తుదిశ్వాస విడిచారు. సీపీఐలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన ఆయన తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన మరణంతో కమ్యూనిస్టులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Suravaram Sudhakar Reddy: మహబూబ్‌నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న సురవరం సుధాకర్‌రెడ్డి జన్మించారు. విద్యార్థి దశ నుంచి సురవరం వామపక్ష భావజాలం వైపు మళ్లారు. ఆ తర్వాత సీపీఐలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. సురవరం తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ఆయన పాల్గొన్నారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ పూర్తిచేశారు.
Suravaram Sudhakar Reddy: ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1974లో విజయలక్ష్మిని సురవరం వివాహమాడారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 1998, 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.