supreme court: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ సుప్రీంకోర్టులో పూర్తయింది. గతంలోనే బీఆర్ఎస్ తరఫు న్యాయవాది వాదనలు పూర్తికాగా, నిన్నటి వరకు ప్రతివాదుల వాదనలు పూర్తయ్యాయి. ఈ విషయంలో సుప్రీం ధర్మాసనం, ప్రతివాదుల తరఫు న్యాయ వాది మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయిలో జరిగాయి. ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డిపైనా ఆగ్రహం వ్యక్తంచేసింది.
supreme court: బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిక విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సమయంలో పలుమార్లు స్పీకర్‌కు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అభ్యంతరాలను వ్యక్తంచేసింది. ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ప్రశ్నించింది.
supreme court: ఇదే అంశంపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీం ధర్మాసనం ప్రస్తావించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినా ఉప ఎన్నికలు రావు.. అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నది. సీఎం వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10 షెడ్యూల్‌ను అపహాస్యం చేయడమే అవుతుందని పేర్కొన్నది. అసెంబ్లీకి, బహిరంగ సభకు తేడా తెలియదా? అని నిలదీసింది. ముఖ్యమంత్రి ఇటువ్యాఖ్యలను పునరావృతం చేయవద్దని హెచ్చరించింది.
supreme court: ఈ దశలో గురువారానికి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ మీదికి వచ్చిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణపై తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురైతే, ఉప ఎన్నికలు వస్తే ఎలా అన్న అంశాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏకంగా కొన్ని సర్వే సంస్థలు ఆ 10 స్థానాల్లో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలను చేసేశాయి. అటు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తమ విశ్వసనీయత కోసం సర్వేలు చేయించుకున్నాయి.

