Delhi Court

Supreme Court: పూర్తిగా బంద్ చేయడానికి వీల్లేదు.. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు!

Supreme Court: దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తలపెట్టిన భారీ ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విధించిన కఠిన ఆంక్షలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సీజేపీ నిరసనకు పిలుపునిచ్చిన క్రమంలో.. ఏకంగా 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని, రైళ్లను రద్దు చేయాలని పోలీసులు ఆదేశించడంపై ధర్మాసనం మండిపడింది.

నిబంధనలు విధించడం అంటే ప్రజా రవాణాను పూర్తిగా స్తంభింపజేయడం కాదని స్పష్టం చేస్తూ.. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
మెట్రోపై సంపూర్ణ నిషేధం కుదరదు” – సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
రవాణా ఆంక్షలతో సాధారణ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మెట్రో రైళ్ల రాకపోకలు కొనసాగాలి..
నియంత్రణల పేరుతో మెట్రో సర్వీసులను పూర్తిగా నిలిపివేయడానికి వీల్లేదు. ప్రజలకు కనీస అసౌకర్యం కలగకుండా నియంత్రిత పద్ధతిలో (Regulated manner) మెట్రో రైళ్లు, ఇతర రైల్వే సేవలను నడపాలి అని ధర్మాసనం తేల్చిచెప్పింది.
మెట్రో, రైలు సర్వీసుల వేళలపై అధికారులు తీసుకునే నియంత్రిత నిర్ణయాలను పౌరులకు విస్తృతంగా ప్రచారం (Due publicity) చేయాలని, చివరి నిమిషంలో సామాన్య ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించింది.
ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేయాలి..
రోడ్డు మార్గాల్లో రాకపోకలు సాగించే సామాన్య ప్రజల కోసం వెంటనే స్పష్టమైన సమగ్ర ట్రాఫిక్ అడ్వైజరీని విడుదల చేయాలని ఢిల్లీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
కోర్టులో సీనియర్ న్యాయవాదుల ప్రశ్నల వర్షం..
నిరసనకారుల తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, ప్రశాంత్ భూషణ్, బృందా గ్రోవర్, గోపాల్ శంకరనారాయణన్ సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించారు..
మితిమీరిన ఆంక్షలు..
ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకముందే 57 మెట్రో స్టేషన్లు మూసేయడం, పదుల సంఖ్యలో రైళ్లను రద్దు చేయడం, సరిహద్దులను దిగ్బంధించడం, హోటళ్లు, పీజీల్లో బుకింగ్స్ వద్దని హెచ్చరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని న్యాయవాదులు వాదించారు.
నిరసనతో సంబంధం లేని లక్షలాది మంది దినసరి ప్రయాణికులు, ఉద్యోగుల రాకపోకల స్వేచ్ఛను ఈ నిర్ణయాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కోర్టు దృష్టికి తెచ్చారు.

హక్కుల సమతుల్యత పాటించాలి – జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి..

“రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే పౌరుల హక్కును గౌరవిస్తూనే.. సమాజంలోని ఇతర సాధారణ ప్రజలు ప్రాథమిక సౌకర్యాలు, ప్రజా రవాణాను పొందే హక్కును కూడా కాపాడాలి. ఈ రెండింటి మధ్య ఖచ్చితమైన సమతుల్యత ఉండాలి” అని జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి వ్యాఖ్యానించారు.

 

పోలీసుల చర్యలు అవసరానికి మించి అతిగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అసలు ఆంక్షలకు సంబంధించి జారీ చేసిన అసలు పోలీసు ఆర్డర్‌ కాపీని తమ ముందు ఉంచాలని ఆదేశించింది.

 

అదే సమయంలో నిరసనకారులు ఆయుధాలు లేకుండా శాంతియుతంగా ఉండాలని, నేషనల్ హైవేలను దిగ్బంధించే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది.
వెనక్కి తగ్గిన కేంద్రం – జంతర్ మంతర్ కాకుండా మరో చోటు?..
సుప్రీంకోర్టు కఠిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా కోర్టుకు కీలక హామీ ఇచ్చారు:
  • మెట్రో రైళ్లను పూర్తిగా ఆపివేయకుండా, నియంత్రిత పద్ధతిలో నడిపేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతానని తెలిపారు.
  • అలాగే జంతర్ మంతర్ వద్ద కాకుండా, నగరంలో ట్రాఫిక్‌కు ఆటంకం కలగని ఇతర ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని నిరసన కోసం కేటాయించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని ఎస్జీ పేర్కొనడంతో.. ఆ దిశగా సరైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *