Tamil Nadu

Tamil Nadu: సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు ప్రభుత్వం..!

Tamil Nadu: తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై కార్తీక దీపం వెలిగించే అంశం తీవ్ర రాజకీయ, న్యాయ వివాదానికి దారితీసింది. నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 24న కొండపై ఉన్న వివాదాస్పద రాతి స్తంభం ‘దీపత్తూన్’ (Deepathoon) వద్ద దీపం వెలిగించాల్సి ఉండగా, ఆ కార్యక్రమం జరగలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను అమలు చేయలేకపోయినందుకు తమిళనాడు ప్రభుత్వం తరఫున మదురై జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణ బుధవారం (నవంబర్ 25, 2026) జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్టేటస్ రిపోర్టు సమర్పిస్తూ బేషరతుగా క్షమాపణలు కోరారు.

అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని కలెక్టర్ తన అఫిడవిట్‌లో వివరంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని, దాదాపు 5,797 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఆలయ యాజమాన్యం ఎంపిక చేసి ఆమోదించిన బృందం ద్వారానే దీపం వెలిగించాల్సి ఉంది.

కానీ దీపత్తూన్ వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ ధర్మకర్తల మండలి (బోర్డు) ఎవరికీ అనుమతి ఇవ్వలేదని, దేవస్థానం అనుమతి లేకుండా తాము వ్యక్తులను ఎంపిక చేయలేమని కలెక్టర్ స్పష్టం చేశారు. దానికి బదులుగా సంప్రదాయ పద్ధతిలోనే కార్తీక దీపం వెలిగించాలని ఆలయ బోర్డు తీర్మానం చేయడంతో, నవంబర్ 24 సాయంత్రం 6 గంటలకు సుబ్రమణ్య స్వామి ఆలయానికి పైన ఉన్న ఉచ్చిపిళ్లయార్ ఆలయ దీప మండపం వద్ద మాత్రమే పోలీసుల భద్రత మధ్య దీపం వెలిగించినట్లు వివరించారు.
న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించలేదని, కోర్టు పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని కలెక్టర్ నిషాంత్ కృష్ణ నివేదికలో పేర్కొన్నారు. భవిష్యత్తులో కోర్టు ఇచ్చే ప్రతి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని, త్వరలోనే పూర్తి ఆధారాలతో మరో అదనపు స్టేటస్ రిపోర్టును సమర్పిస్తామని తెలిపారు. మరోవైపు కొండపై దీపస్తంభం వద్ద దీపం వెలిగించకపోవడంపై బీజేపీ, హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కాగా, దీపత్తూన్ వద్ద దీపం వెలిగించేందుకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్‌తో పాటు మదురై కలెక్టర్, మరో ముగ్గురు అధికారులపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తుది విచారణను సుప్రీంకోర్టు 2027 జనవరికి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *