Wife Kills Husband 

Wife Kills Husband: రూ.18 లక్షల కోసం భర్త ని హత్య చేసిన భార్య..!

Wife Kills Husband: డబ్బుపై అత్యాశ, వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని అత్యంత కిరాతకంగా బలితీసుకున్నాయి! ప్రభుత్వం ఇచ్చే రూ.18 లక్షల ముంపు పరిహారం డబ్బులను సొంతం చేసుకోవడానికి, కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేయించింది ఓ భార్య. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన గజ్జి మల్లికార్జున్ (23) పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. అతడికి మక్తల్‌కు చెందిన అంజమ్మ అనే యువతితో వివాహమైంది. అయితే, రెండు నెలల క్రితం మల్లికార్జున్ శ్రీశైలం వెళ్లిన సమయంలో, బస్సు ప్రయాణంలో రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన శివ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారడంతో శివ తరచూ మల్లికార్జున్ ఇంటికి, గ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే శివకు, మల్లికార్జున్ భార్య అంజమ్మకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఇదిలా ఉండగా, ఉదండాపూర్ జలాశయం (రిజర్వాయర్) నిర్మాణంలో భూములు కోల్పోయినందుకు గాను ముంపు పరిహారం కింద మల్లికార్జున్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.18 లక్షలు మంజూరయ్యాయి. ఆ భారీ మొత్తంపై కన్నేసిన అంజమ్మ, తన ప్రియుడు శివతో కలిసి భర్తను అడ్డు తొలగించుకుని ఆ డబ్బుతో విలాసవంతంగా గడపాలని పక్కా పథకం రచించింది.
ఈ ప్లాన్‌లో భాగంగా ఈ నెల (నవంబర్) 20వ తేదీన కూలిపని ఉందని నమ్మించి మల్లికార్జున్‌ను ఇంటి నుంచి బయటకు పిలిపించారు. అనంతరం నిందితుడు శివ, మల్లికార్జున్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా దాచిపెట్టాడు. తాజాగా రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నెమళ్లగుట్ట సమీపంలో మల్లికార్జున్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమవడంతో ఈ దారుణం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *