Suryapet: సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఐకేపి సెంటర్ వద్ద రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళ్తే తుంగతుర్తి మండలం చౌళ్లతండాకు చెందిన గుగులోతు కీమా నాయక్, పున్నమ్మ దంపతులు అన్నారం గ్రామానికి చెందిన గోగుల రామకృష్ణకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. పండించిన ధాన్యాన్ని ఈనెల మొదటి వారంలో అన్నారం ఐకేపీ కేంద్రానికి పంపించారు. భీమాకు చెందిన వడ్లను ఈ నెల 17న లారీలో ఎగుమతి చేసి కోదాడలోని వెంకటరమణ రైస్ మిల్లుకు ఎగుమతి చేశారు. వరి ధాన్యం నల్లగా ఉందని, దించలేదని మిల్లు నిర్వాహకులు ఈ నెల 18న ఐకేపీ కేంద్రానికి సమాచారం అందించారు.
రైతు భీమా, ఐకేపీ నిర్వాహకులు మిల్లుకు వెళ్లి అడగ్గా వడ్లు బాగోలేదని బస్తాకు మూడు కిలోలు తగ్గిస్తామని మిల్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు రైతు ఒప్పుకోలేదు. మిల్లు నిర్వాహకులు శనివారం ఉదయం ధాన్యాన్ని దించకుండానే ఐకేపీ కేంద్రానికి తిరిగి పంపించారు. ధాన్యం లారీ తిరిగి వచ్చిందని ఐకేపీ నిర్వాహకులు చెప్పారు. దీంతో రైతు భీమా దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద లారీ వద్దకు రైతు భీమా దంపతులు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఒంటిపై పెట్రోలు పోసుకుంటున్న సమయంలో సెంటర్‌లోని తోటి రైతులు వారిని చూసి వారి చేతుల్లోని పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. దీంతో వారు స్థానిక తహసీల్దార్ దయానందంకు ఫిర్యాదు చేశారు. వెంటనే తహసీల్దార్ డీటీ కంట్లమయ్య, ఏఓ బాలకృష్ణ, ఏపీఎం రాంబాబు ఐకేపీ సెంటర్‌కు చేరుకున్నారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మిల్లు యాజమాన్యంతో మాట్లాడి నష్టపోకుండా తిరిగి మిల్లుకు దింపేందుకు పంపించారు.