TTD: కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయం ముందు లేదా ఆలయ ప్రాంగణంలో రీల్స్ (వీడియోలు) చిత్రీకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
రీల్స్‌పై టీటీడీ కఠిన హెచ్చరిక
టీటీడీ విడుదల చేసిన ఒక ప్రకటనలో, పవిత్రమైన ఆలయ వాతావరణాన్ని భక్తులు గౌరవించాలని కోరింది. కొందరు భక్తులు, ముఖ్యంగా యువత, ఆలయం ముందు లేదా ఆలయ ప్రాంగణంలో సెల్ఫీలు, టిక్‌టాక్ వీడియోలు, రీల్స్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని టీటీడీ దృష్టికి వచ్చింది. ఇది ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తుందని, ఇతర భక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని టీటీడీ అభిప్రాయపడింది.
ఆధ్యాత్మిక వాతావరణం కాపాడాలని విజ్ఞప్తి
“తిరుమల శ్రీవారి ఆలయం అత్యంత పవిత్రమైన ప్రదేశం. భక్తులంతా ఇక్కడికి భక్తి భావంతో వస్తారు. దయచేసి ఆలయ నియమాలను పాటించి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది” అని అధికారులు తెలిపారు. ఆలయంలో వీడియోలు, ఫోటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని, నిఘా కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది.
కఠిన చర్యలకు ఉపక్రమిస్తాం: టీటీడీ
భక్తులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. ఆలయ పవిత్రతను కాపాడటం ప్రతి భక్తుడి బాధ్యత అని టీటీడీ గుర్తు చేసింది.