Srivari Brahmotsavam 2024: దేవదేవుడు.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. ఏడుకొండల వాడు శ్రీ వేంకటేశుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. శుక్రవారం అంటే అక్టోబర్ 05 సాయంత్రం 5:45 – 6 గంటల మధ్య మీనలగ్న ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గరుడ పతాకాన్ని ఊరేగించి శ్రీదేవి, భూదేవి సామెత శ్రీ మలయప్పస్వామి సమక్షంలో ధ్వజారోహణను వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. దీంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముల్లోకాలలో ముక్కోటి దేవతలను ఆహ్వానించినట్టయింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు ధ్వజారోహణ చేసిన గరుడ పతాకం భక్తులకు సూచన ఇచ్చింది.
పట్టుబట్టలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు..
Srivari Brahmotsavam 2024: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీసమేతంగా కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టుబట్టలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమలలో ఎక్కడ చూసినా శ్రీవారి నామస్మరణే వినిపించాలని చెప్పారు. తిరుమల పవిత్రతను నిలఆంజనేయ స్వామి ఆలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిలకు సీఎంకు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి తలకు పరివట్టం చుట్టి పట్టువస్త్రాలను ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అందజేశారు. చంద్రబాబు దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. తరువాత రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం అందించి చంద్రబాబుకు శేషవస్త్రాన్ని కప్పారు. తితిదే ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు.
తొలిరోజు వాహన సేవ.. పెద్ద శేష వాహనం పై శ్రీవారు..
బ్రహ్మోత్సవాల్లో (Srivari Brahmotsavam 2024)భాగంగా మొదటి రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణ శేష వాహనంపై (పెద్దశేష వాహనం) పై పరమపద వైకుంఠనాథుడి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తిరుమాడ వీధుల్లో మలయప్పస్వామి వారు భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఊరేగారు.
Srivari Brahmotsavam 2024: ఈ సందర్భంగా తొలిరోజు శుక్రవారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీనలగ్న శుభముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గరుడ పటాన్ని ఊరేగించి బ్రహ్మాది దేవతలను ఆహ్వానిస్తూ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సమక్షంలో ధ్వజపటాన్ని ఎగరవేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీకాకుళం నుండి శ్రీమతి దుర్గా భవానీ, తిరుమల నుండి శ్రీనివాసులు, రాజమండ్రి నుండి శ్రీసురేష్ బాబు, తిరుపతి బాలమందిర్ విద్యార్థులు కోలాటాలతో అలరించారు. హైదరాబాదుకు చెందిన శ్రీమతి లక్ష్మీదేవి బృందం ఒగ్గుడోలుతోను, తిరుపతికి చెందిన డాక్టర్ మురళీకృష్ణ బృందం మోహినీయట్టంతోను, కర్ణాటకకు చెందిన శ్రీమతి వనీష బృందం పటకునిత కళా విన్యాసం, శ్రీ రవికుమార్ చిలిపిలి గొంబె నృత్యం, శ్రీ నాగేంద్ర బృందం కంసాలి రూపకంతో ఇచ్చిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 14 కళాబృందాలలో 410 మంది కళాకారులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
శ్రీవారి డైరీలు ఆవిష్కరించిన ముఖ్యమంత్రి..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025వ సంవత్సరానికి సంబంధించిన శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్లు అక్టోబర్ 5వ తేదీ నుంచి తిరుమలలో భక్తులకు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా అక్టోబర్ రెండో వారం నుంచి రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయి.

