Sridhar Babu: హెచ్-1బీ వీసా రుసుము పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల భారతీయ టెక్ కంపెనీలకు గణనీయమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “టెక్ కంపెనీల పనితీరు దెబ్బతినేలా, మెరుగైన ఉద్యోగాలు పొందాలనుకునే యువత కలలపై నీళ్లు చల్లేలా ట్రంప్ నిర్ణయం ఉంది” అని విమర్శించారు.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందో సమాధానం చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విషయంలో మోదీ వైఖరి సానుకూలంగా లేదని మండిపడ్డారు.
అమెరికాలోని అనేక టెక్ కంపెనీలు కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై నేరుగా ప్రభావం చూపనుందని, చిన్న సాఫ్ట్‌వేర్ సంస్థలు మూతపడే పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే, విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్ తగ్గితే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని మంత్రి హెచ్చరించారు. హెచ్-1బీ వీసాలను పొందుతున్న వారిలో అధిక శాతం టెక్ సంబంధిత ఉద్యోగులేనని ఆయన వివరించారు.