Lok Sabha debate

Lok Sabha debate: లోక్‌సభలోవందేమాతర గీతంపై ప్రత్యేక చర్చ

Lok Sabha debate: దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన ‘వందేమాతరం’ గీతంపై ఇవాళ పార్లమెంట్‌లో విస్తృత చర్చ ప్రారంభంకానుంది. జాతీయోద్యమానికి ప్రేరణగా నిలిచిన ఈ గేయం 150 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పొడవున జరిగే వేడుకల మొదటి దశగా లోక్‌సభలో ప్రత్యేకంగా మాట్లాడేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ఈ చర్చను ఆరంభించనున్నారు. ఆయన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడతారని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 10 గంటల సమయాన్ని  కేటాయించారు. ఈ సందర్భంగా వందేమాతరం గీతం గురించి ఇంతవరకు పెద్దగా చర్చలోకి రానీ కొన్ని చారిత్రక అంశాలను కూడా ప్రధాని ప్రస్తావించే అవకాశముందని తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఉపనేత గౌరవ్‌ గగోయ్‌, ప్రియాంకా గాంధీ వాద్రా సహా ఎనిమిది మంది నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచనున్నారు. మంగళవారం మాత్రం వందేమాతరం చర్చ రాజ్యసభకు మారుతుంది. అక్కడ హోంమంత్రి అమిత్‌ షా చర్చను ప్రారంభించనున్నారు. ఆయన తర్వాత కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రసంగిస్తారు.

Also Read: Live-In Relationship: వివాహ వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు

బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ గీతం 1875 నవంబర్ 7న ‘బంగదర్శన్‌’ అనే సాహిత్య పత్రికలో మొదటి సారి ప్రచురించబడింది. తర్వాత 1882లో రచయిత తన నవల ‘ఆనందమఠ్‌’లో దీన్ని ప్రధానంగా చేర్చారు. 1905లో బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమంలో వందేమాతరం కీలక నినాదంగా మారి, దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధులకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. 1950 జనవరి 24న దీనిని అధికారికంగా జాతీయ గీతంగా గుర్తించారు.

ప్రధాని మోదీ గత నెలలో ఢిల్లీలో వందేమాతరం 150 ఏళ్ల వేడుకలను ప్రారంభించిన విషయం తెలిసిందే. విద్యార్థుల్లో జాతీయ గేయం ప్రాధాన్యాన్ని పెంచేందుకు సంవత్సరం పొడవున ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ఇదే సందర్భంలో 1937లో కాంగ్రెస్‌ కొన్ని కీలక చరణాలను తొలగించిందని ప్రధాని ఇటీవల విమర్శలు చేసిన విషయం మరలా చర్చలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక పార్లమెంట్‌ మరోవైపు ఎన్నికల సంస్కరణలపై కూడా ఈ వారం విస్తృత చర్చ చేయనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సహా పలు అంశాలపై లోక్‌సభ మంగళ, బుధవారాల్లో, రాజ్యసభ బుధ, గురువారాల్లో మాట్లాడనుంది. రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ తదితరులు లోక్‌సభలో తమ వాదనలు వినిపిస్తారు.

కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు కూడా ఆకర్షిస్తోంది. విపక్షాల అభిప్రాయంలో, ‘విప్‌’ ఒత్తిడికి లోనుకాకుండా సభ్యులు స్వతంత్రంగా ఓటు వేయడానికి అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న సందర్భంలో, మరోవైపు ‘SIR’ అంశంపై విపక్షం భారీ నిరసనలు వ్యక్తం చేస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య ‘వందేమాతరం’పై చర్చ సజావుగా సాగుతుందా లేదా అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *