Proddatur: కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం శ్రీరామ్‌నగర్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే దారుణం చోటుచేసుకుంది. తల్లి మందలించిందనే కోపంతో కన్న కుమారుడే ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఉప్పలపాటి లక్ష్మీదేవి అనే ఉపాధ్యాయురాలు (టీచర్)ను ఆమె కొడుకు యశ్వంత్‌రెడ్డి (23) గొంతు కోసి చంపిన ఈ సంఘటన ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
లక్ష్మీదేవి ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డి నగర్‌లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త విజయభాస్కర్ రెడ్డి ఒక బ్రాందీ షాపులో పనిచేసేవారు, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. బీటెక్ పూర్తి చేసిన వారి ఏకైక సంతానం యశ్వంత్‌రెడ్డి. సినిమాల్లో నటించాలనే కోరిక యశ్వంత్రెడ్డిలో బలంగా ఉండేది. దీనికోసం తరచూ డబ్బులు కావాలని తల్లిని వేధించేవాడని, ఈ విషయంలోనే తల్లి లక్ష్మీదేవి అతడిని మందలించేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: Danish Kaneria: భారత పౌరసత్వంపై పాక్ మాజీ క్రికెటర్ కీలక ప్రకటన
ఆదివారం (అక్టోబర్ 5) ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చిన యశ్వంత్, ఇంట్లో మొదట నిద్రపోతున్న తన తండ్రిని గదిలో బయటి నుంచి తాళం వేసి బంధించాడు. ఆ తర్వాత వంటింట్లో ఉన్న తల్లితో గొడవపడి, ఆగ్రహానికి గురై కత్తితో ఆమె గొంతు కోశాడు. హత్య అనంతరం, రక్తపు మడుగులో ఉన్న తల్లి మృతదేహాన్ని ఇంట్లో నుండి వరండాలోకి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి పడుకోబెట్టాడు. ఈ దారుణం జరిగిన తర్వాత, నిందితుడు యశ్వంత్ ఇంట్లోని హాల్లో కూర్చుని మొబైల్లో శివుడి పాటలు వింటున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
కొంతకాలంగా యశ్వంత్‌రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు డాక్టర్ వద్ద చికిత్స కూడా తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే కన్నతల్లి అని చూడకుండా ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యశ్వంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.