Somireddy chandramohan: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇది కేవలం రూ. 3,200 కోట్ల కుంభకోణం మాత్రమే కాదని, దాదాపు 30 వేల మంది ప్రాణాలు బలైన ఘోరమైన స్కామ్ అని అన్నారు.
వైసీపీ నేతలు ఈ కుంభకోణాన్ని దేశ సరిహద్దులు దాటి విస్తరించారని, వారికి స్వర్ణ పతకాలు ఇవ్వాల్సిన స్థాయిలో పని చేశారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కేసుపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈడీ విచారణ జరుపుతోందని గుర్తు చేసిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ భారీ మద్యం కుంభకోణంపై కూడా అదే స్థాయిలో ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
‘‘ఒక వ్యక్తి రూ. 50 కోట్లు పెట్టి కుక్క పిల్ల కొనుగోలు చేశానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టగానే… అది ఫేక్ అని నిర్ధారణ కాకముందే ఈడీ స్పందించింది. అలాంటప్పుడు రాష్ట్రంలో జరిగిన అసలైన లిక్కర్ స్కాం విషయంలో ఎందుకు మౌనంగా ఉంది?’’ అని ఆయన ప్రశ్నించారు.
పహల్గామ్ టెర్రరిస్టులపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కఠిన చర్యలు ప్రజల ముందే ఉన్నాయని పేర్కొన్న సోమిరెడ్డి, దేశంలో ఆర్థిక ఉగ్రవాదులపై కూడా అలాగే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు.

