Power Plant: అసలే రాయలసీమ ఆపై కడప జిల్లా….ఇక్కడ ప్రభుత్వాలు మారినా కడప జిల్లా తలరాత మాత్రం మారడం లేదు.అలాంటి కడప జిల్లాపై సీఎం చంద్రబాబు ఎప్పుడూ ప్రత్యేక దృష్టి సారిస్తారు. 2014 టీడీపీ ప్రభుత్వంలో కడప జిల్లా పట్టిసీమ ద్వారా సాగునీరు అందించిన ఘనత చంద్రబాబుదే… జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించారు. గతంలో జిల్లాలో రెండు మూడు సిమెంట్ ఫ్యాక్టరీలు తప్ప మరి ఏ ఇతర భారీ పరిశ్రమలు లేవని చెప్పవచ్చు. అయితే ఏడాది పొడవునా ఎండలు తాండవం చేస్తూ ఉంటాయి. కరువు సీమలో మండే ఎండలను ఎనర్జీగా మార్చడానికి ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
కూటమి ప్రభుత్వం అందులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో అతిపెద్ద భారీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అదాని కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. కొండాపురం మండలంలోని రాగి కుంట గ్రామంలో 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి పనులు ప్రారంభించింది అదాని కంపెనీ.
దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పనులను రిత్విక్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది అదాని…స్థానికులను కాదని వేరే కంపెనీకి పనులు ఎలా ఇస్తారంటూ లోకల్ పొలిటికల్ లీడర్స్ దాడులకు దిగడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. కాంట్రాక్ట్ పనులతో పాటు ఉద్యోగాలు కూడా స్థానికులకే ఇవ్వాలంటూ సోలార్ పవర్ ప్లాంట్ పనులను అడ్డుకొని ఆ సంస్థ ఆస్తులను ధ్వంసం చేశారు స్థానిక రాజకీయ నేత అనుచరులు… దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారట… ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబ సభ్యులు నియోజకవర్గ పరిధిలో పరిశ్రమల ఏర్పాటు చేసే వ్యాపారులను డబ్బులు కోసమే వేధిస్తున్నారని సీఎంకి ఫిర్యాదులు వెళ్లాయట… ఈ అంశంపై సీఎం కూడా సీరియస్‌గా ఉన్నారట.
ఇది కూడా చదవండి: Kakarla Suresh: ఉదయగిరి ప్రజల కోసం కాకర్ల సురేష్ పోరాటం
Power Plant: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యుల వ్యవహార శైలి ఆయనకు తలభారంగా మారిందట.కొండాపురం మండలంలో గత రెండు నెలల క్రితం ఆయన అనుచరులు సోలార్ పవర్ ప్లాంట్‌లు కాంట్రాక్టు పనులు తమకు ఇవ్వలేదని ఒకరిపై ఒకరు గన్‌తో ఫైరింగ్ చేసిన ఘటనతో ఆయనకు మరింత తల నొప్పిగా మారిందట.ఈ ఘటన మరువకమునుపే, మరోసారి సోలార్ పవర్ ప్లాంట్ పనులను అడ్డగించి, ఆస్తులను ధ్వంసం చేయడంతో ఆదాని కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అనుచరులపై కేసులు నమోదు అయ్యాయి.
రాష్ట్రానికి పరిశ్రమలు తేవడానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంటే కొందరు రాజకీయ నాయకులు కాసులు కోసం కక్కుర్తిపడి వాటిని అడ్డుకోవడం సమంజసం కాదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇకనైనా ఆ నేత తన పంతాను మార్చుకొని ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పనిచేస్తారో లేక, తన పంతం నెగ్గించుకోవడానికి విభేదాలను సృష్టిస్తారో మరి వేచి చూడాల్సిందే.