SLBC Project: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి నెలరోజులు దాటాక రెండో మృతదేహాన్ని నిపుణులు గుర్తించారు. ఈ ప్రమాదంలో 8 మంది గల్లంతు కాగా, వారిలో ఒకరిని ఇప్పటికే గుర్తించి వెలికితీశారు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దశలో ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలోనే 50 మీటర్ల దూరంలో మరో మృతదేహాన్ని ఈ రోజు గుర్తించారు. ఆ మృతదేహం మొత్తం కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతున్నట్టు సిబ్బంది ద్వారా తెలిసింది.
SLBC Project: మృతదేహాల వెలికితీత కోసం టీబీఎం యంత్రాన్ని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి తొలగిస్తుండగా, అక్కడే తొలి మృతదేహం లభించింది. అదే ప్రదేశంలో మరొకరిని గుర్తించగా, ఇంకా ఆరుగురి కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అదే ప్రాంతంలో భరించలేని దుర్వాసన వెదజల్లుతుండటంతో అక్కడే ఇతర మృతదేహాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో స్ప్రే బాటిళ్లు చల్లి మరీ సహాయక చర్యలు చేపడుతున్నారు.
SLBC Project: టన్నెల్‌లో చేపట్టిన సహాయక చర్యలకు తీవ్రస్థాయిలో అడ్డంకులు కలుగుతున్నాయి. ఒకవైపు బురుదను తోడేస్తుంటే, మరోవైపు నీటి ఊటల నుంచి నీరు చేరి ఇబ్బందిగా మారింది. మరోవైపు మట్టి, రాళ్లు పెద్ద మొత్తంలో పోగైనట్టు కనిపిస్తున్నది. 5 పంపుల ద్వారా నీటిని తోడేస్తున్నా, పెద్ద మొత్తంలో నీటి ఊట ఊరుతుందని సిబ్బంది చెప్పారు. టన్నెల్ లోపల 13.500 కిలోమీటర్ల వద్ద సీపేజీ సమస్య తీవ్రంగా ఉన్నదని తెలిపారు. ఇదిలా ఉండగా, మరో ఆరు మృతదేహాలను కూడా ఒకటి రెండు రోజుల్లో గుర్తించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.