Begumpet Drugs Case: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రగ్స్ కల్చర్ ప్రమాదకర స్థాయిలో కోరలు చాస్తోంది. ఎక్కడ చూసినా గంజాయి, ఇతర మత్తు పదార్థాల కేసులే వెలుగు చూస్తుండగా, యువత, ముఖ్యంగా టీనేజర్స్ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. ఈ మహమ్మారి ఇప్పుడు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కూడా వదలడం లేదు.
హోటల్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్‌లో డ్రగ్స్ దందా
తాజాగా, బేగంపేటలోని ఒక ప్రముఖ హోటల్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్‌పై ఈగల్ టీమ్ చేసిన దాడులు విస్తుపోయే వాస్తవాలను వెల్లడించాయి. ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థులు విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటున్న తీరు చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు.విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 11 మంది విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీమ్ నిర్ధారించింది. ఒక బర్త్‌డే పార్టీ సందర్భంగా వీరు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్‌ను వారికి ఎస్.ఆర్. నగర్‌కు సంబంధించిన ఓ వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.మొదటి విడతగా ఆరుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: సౌరవ్ గంగూలీని ఆపడం ఎవరి తరమూ కాదు
నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యం
షాకింగ్ విషయం ఏమిటంటే, గతంలో కూడా ఇదే ఇనిస్టిట్యూట్‌లో డ్రగ్స్ కేసులు వెలుగుచూసినట్లు ఈగల్ టీమ్ వెల్లడించింది. ఎన్నిసార్లు తనిఖీలు చేసినా, సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులు
విద్యార్థులలో డ్రగ్స్ వాడకం పెరగడంపై గతంలో వెలుగుచూసిన కొన్ని ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. గత ఆగస్టులో మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ వినియోగం కలకలం రేపింది. ఏకంగా 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. దీనికి రెండు నెలల క్రితం గచ్చిబౌలి ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. పోలీసులు డ్రగ్స్ సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, విద్యా సంస్థలలో యువత మత్తుకు బానిసలవుతున్న తీరు తల్లిదండ్రులు మరియు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

