Warangal: ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం చేసిన ముఠాను వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాలో ఓ మైనర్ బాలిక, వ్యభిచార గృహం నడిపే మహిళ, నేర చరిత్ర కలిగిన నలుగురు యువకులు ఉండగా.. వారందరినీ పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు.
వారి వద్ద నుంచి 4,320 కండోమ్ ప్యాకెట్లు, ఒక కిలో 800 గ్రాముల గంజాయి, ఒక కారు, 75 వేల రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు.
హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన ముస్కు లత అనే మహిళ కొంతకాలంగా వ్యభిచార గృహం నడిపిస్తోంది. తన బిజినెస్ కోసం మైనర్ బాలికలకు ట్రాప్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో వరంగల్ నగరంలో తల్లిదండ్రులు చనిపోయిన ఓ మైనర్ బాలికను చేర దీసి.. తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించింది. అనంతరం ఆమెకు మెల్లిగా మద్యం, గంజాయి మత్తు అలవాటు చేసి, వ్యభిచార రొంపిలోకి దించింది. అనంతరం ఆమె ద్వారా మరికొంతమంది మహిళలు, మైనర్లను వ్యభిచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది.
ముస్కు లత ప్లాన్ లో భాగంగా ఆ మైనర్ బాలిక ఇన్ స్టా గ్రామ్ లో యాక్టీవ్ గా ఉండే బాలికలను టార్గెట్ చేసింది. కాగా వరంగల్ ఓ సిటీకి చెందిన ఓ స్కూల్ బాలిక ఇన్ స్టా గ్రామ్ యాక్టీవ్ గా ఉంటుండగా.. ఆమెతో మెల్లిగా పరిచయం పెంచుకుంది. అనంతరం ఆ బాలిక స్కూల్ కు వెళ్లే క్రమంలో ఆమెను కలవడం, ఆమెకు షాపింగ్ ల పేరున డ్రెస్ లు కొనివ్వడం, డబ్బులు ఇవ్వడం లాంటివి చేసి మరింత దగ్గరైంది. తన బాయ్ ఫ్రెండ్, వరంగల్ శంభునిపేటకు చెందిన అబ్దుల్ ఆఫ్నాన్ తో కలిసి ఆ స్కూల్ బాలికను ట్రాప్ చేసింది. మెల్లిగా మద్యం, గంజాయి అలవాటు చేసింది. దీంతో ఆ స్కూల్ బాలిక పూర్తిగా వారి కంట్రోల్ లోకి వెళ్లిపోయింది.
లత చేరదీసిన మైనర్ బాలిక తన బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ ఆఫ్నాన్ తో స్కూల్ బాలికను ట్రాప్ చేయగా.. ఈ విషయాన్ని ఆఫ్నాన్ తన స్నేహితులైన షేక్ సైలాబీ బాబా, మహ్మద్ అల్తాఫ్ కు చెప్పాడు. అనంతరం అందరూ కలిసి ఆ స్కూల్ బాలికతో కలిసి ఎంజాయి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న ఆ బాలిక స్కూల్ కు వెళ్తుండగా.. తీసుకొచ్చారు. అనంతరం ఆఫ్నాన్ తనకు పరిచయం ఉన్న మీర్జా ఫయజ్ బేగ్ అలియాస్ వదూద్ అనే వ్యక్తి వద్ద కొంత గంజాయి కొనుగోలు చేశాడు. ఆ తరువాత అంతా కలిసి నర్సంపేట సమీపంలో సైలాబీ బాబా బంధువులకు సంబంధించిన ఇల్లు ఉండగా.. స్కూల్ బాలికను అక్కడికి తీసుకెళ్లారు.
ఈ నెల 11 స్కూల్ బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అదే రోజు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లిదండ్రులతో పాటు స్తానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆ తరువాత నిందితులను గుర్తించారు.
ఈ క్రమంలో మైనర్ బాలికతో పాటు వ్యభిచార గృహం నడిపించే ముస్కు లత, మిగతా నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. నిందితులైన నలుగురు యువకులపైనా గతంలో నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను గుర్తించి, పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం, ఎస్‌ఐలు శ్రీకాంత్, సురేశ్లతో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.

