అమరావతి: తిరుమల లడ్డూ(Tirupati Laddu) కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. లడ్డూ తయారీ కోసం బీఫ్ కొవ్వుకు సంబంధించిన ఆయిల్ ను ఉపయోగించారని ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. భక్తుల మనోభావాలను దెబ్బ తీశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. గత జగన్ ప్రభుత్వమే ఈ కల్తీ లడ్డూ వ్యవహారానికి కారణమని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు.
Tirupati Laddu: తిరుమల లడ్డూ అపవిత్రం చేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ భక్తులతోపాటు దేశంలోని పలు హిందూ సంఘాలు, రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు. అవసరమైతే సీబీఐ దర్వాప్తు జరపాలని కోరారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు సిట్‌లో సభ్యులుగా ఉండనున్నారు.