Zubeen Garg: బాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎంతోమంది అభిమానులను తన గాత్రంతో అలరించిన ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ (52) కన్నుమూశారు. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు ఆయన మరణించారు. జుబిన్ గార్గ్ మృతితో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సింగపూర్‌లో విషాదం
జుబిన్ గార్గ్ ఈ నెల 20, 21న జరగనున్న నార్త్-ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ ఈవెంట్లో పాల్గొనేందుకు ఇటీవల సింగపూర్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్కూబా డైవింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సముద్రంలో పడిపోయిన జుబిన్ గార్గ్‌ను రక్షించినప్పటికీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
‘యా ఆలీ’ పాటతో స్టార్డమ్
జుబిన్ గార్గ్ బాలీవుడ్లో ఎన్నో హిట్ పాటలు పాడారు. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ, కంగనా రనౌత్ నటించిన ‘గ్యాంగ్‌స్టర్’ సినిమాలో ఆయన పాడిన ‘యా ఆలీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ సింగర్‌గా ఎదిగారు. హిందీతో పాటు అస్సామీ, బెంగాలీ, నేపాలీ, ఒడియా వంటి పలు ప్రాంతీయ భాషల్లో కూడా పాటలు పాడి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నివాళులు అర్పిస్తున్నారు.