Winter Tips: శీతాకాలం వచ్చిందంటే చల్లదనం, తాజాదనం అనుభూతి కలిగిస్తుంది. కానీ అదే సమయంలో ఇది మన చర్మానికి, ముఖ్యంగా మన పాదాల చర్మానికి సమస్యలను తెస్తుంది. ఈ కాలంలో వాతావరణం పొడిగా ఉండటం, తేమ తగ్గిపోవడం వల్ల పాదాల చర్మం పొడిబారి, పగుళ్లు రావడం సాధారణంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది క్రీములు, లోషన్లు ఉపయోగించినా ఫలితం తాత్కాలికమే. సమస్య మళ్లీ తిరిగి వస్తుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో పాదాల పగుళ్లను నివారించి, మడమలను మృదువుగా, అందంగా ఉంచుకోవచ్చు.
ఇంటి వద్దే తయారు చేసుకునే చిట్కాలు :
పాదాలను మృదువుగా చేయడానికి బియ్యం పిండి, నిమ్మరసం, బాడీ వాష్, కొబ్బరి నూనెతో సులభంగా మాస్క్ తయారు చేయవచ్చు.
ఒక చెంచా బియ్యం పిండి, సగం నిమ్మరసం, ఒక చెంచా బాడీ వాష్, రెండు చెంచాల కొబ్బరి నూనె కలిపి చిక్కటి పేస్ట్‌గా తయారు చేయాలి. ముందుగా పాదాలను శుభ్రం చేసుకుని, ఈ పేస్ట్‌ను ప్యాక్‌లా అప్లై చేయాలి. 15–20 నిమిషాల తర్వాత కడిగి, చివరగా మాయిశ్చరైజర్ అప్లై చేస్తే పాదాలు మృదువుగా మారతాయి.
10 గ్రాముల పటికను తక్కువ మంటపై కరిగించి, చల్లారిన తర్వాత పొడిగా చేసుకోవాలి. రాత్రి పాదాలను గోరువెచ్చని నీటిలో 10–15 నిమిషాలు నానబెట్టి, పొడిగా తుడిచి, పటిక పొడి, కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌గా చేసి మడమలకు రాయాలి. కాటన్ సాక్స్ వేసుకుని రాత్రంతా అలాగే ఉంచితే, గాయాలు 7–10 రోజుల్లో నయమవుతాయి.
ఒక చిన్న కొవ్వొత్తి ముక్కలు, 2–3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని, డబుల్ బాయిలర్‌లో వేడి చేయాలి. మైనం కరిగి నూనెతో కలిసిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పగిలిన మడమలపై వెచ్చగా ఉన్నప్పుడే రాయాలి. ప్రతి రాత్రి ఈ ప్రక్రియను చేస్తే 10–15 రోజుల్లో పాదాలు మృదువుగా మారతాయి.
Also Read: Makhana: మఖానా ఎక్కువగా తింటే కలిగే దుష్ప్రభావాలు ఇవే..!
నూనె మసాజ్: ప్రతి రోజు నిద్రకు ముందు కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లేదా కలబంద జెల్‌తో మడమలకు మసాజ్ చేయండి. ఇవి చర్మానికి లోతైన తేమను అందిస్తాయి.
వేడి నీటితో ఆవిరి: పాదాలను వేడి నీటిలో 10–15 నిమిషాలు ఉంచి స్క్రబ్ చేయండి. చనిపోయిన చర్మకణాలు తొలగిపోతాయి. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి.
తేనె మస్క్: పగిలిన మడమలపై తేనె రాసి 15 నిమిషాల తర్వాత కడగండి. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటంతో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
ముఖ్య సూచన..
చలికాలంలో చల్లటి గాలి, తేమ లేకపోవడం వల్ల చర్మం పొడిగా మారుతుంది. పాదాల పగుళ్లు ఎక్కువైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది. కానీ పై చెప్పిన ఇంటి చిట్కాలను తరచూ పాటిస్తే, పాదాలు మృదువుగా, ఆరోగ్యంగా ఉండి, చలికాలం మొత్తం అందంగా కనిపిస్తాయి.

