Crime News: కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్ కొనివ్వలేదన్న కారణంతో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే, వీణవంక మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చుక్క ఆదిత్య (10వ తరగతి) ఇల్లంతకుంట మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్నాడు. ఇటీవల సెలవుల కారణంగా ఇంటికి వచ్చిన ఆదిత్య, తండ్రిని బైక్ కొని ఇవ్వమని అడిగాడు. అయితే తల్లిదండ్రులు “కొద్దిరోజుల్లో కొంటాం” అని చెప్పి నచ్చజెప్పారు.
తల్లిదండ్రుల మాట వినని ఆదిత్య, జూలై 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆదిత్య మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.

